బొగ్గు నిల్వలు చూస్తే భయం

ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్‌ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది.

Published : 24 Apr 2024 06:38 IST

ఏప్రిల్‌ ఎఫ్‌పీపీసీఏ ప్రతిపాదనలు సిద్ధం
రూ.288 కోట్ల భారం పడే అవకాశం
థర్మల్‌ కేంద్రాల దగ్గర తక్కువగా బొగ్గు నిల్వలు

ఈనాడు, అమరావతి: ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్‌ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. కృష్ణపట్నంలో మాత్రం 4, 5 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండటంతో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండటంతో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం 245.95 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ)గా ఉంటోంది. అందులో ఏపీ జెన్‌కో థర్మల్‌ యూనిట్ల నుంచి రోజుకు సుమారు 95 నుంచి 100 ఎంయూల మధ్య విద్యుత్‌ అందుతోంది. ఈ సమయంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ ఉత్పత్తి తగ్గించాల్సి వస్తే.. ఆ మేరకు బహిరంగ మార్కెట్‌ నుంచి అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

ఏప్రిల్‌లో రూ.288 కోట్ల ఎఫ్‌పీపీసీఏ బాదుడు!

విద్యుత్‌ డిమాండ్‌ మేరకు సరఫరా చేయడానికి స్వల్పకాలిక ఒప్పందాలు, రియల్‌టైం మార్కెట్‌లో రోజుకు సగటున 40 ఎంయూల విద్యుత్‌ను డిస్కంలు కొనాల్సి వస్తోంది. జెన్‌కో ఉత్పత్తి తగ్గితే ఆ మేరకు బహిరంగ మార్కెట్‌పై ఆధారపడాల్సిందే. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌కు సగటున రూ.7.48 చొప్పున కొంటున్నారు. ఏపీఈఆర్‌సీ అనుమతించిన దాని కంటే యూనిట్‌కు అదనంగా సుమారు రూ.3 చొప్పున అధిక మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఆ మొత్తాన్ని ఇంధన సర్దుబాటు ఛార్జీ (ఎఫ్‌పీపీసీఏ)ల పేరుతో డిస్కంలు ప్రతి నెలా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి వినియోగించిన విద్యుత్‌ ఆధారంగా ప్రతి నెలా యూనిట్‌కు 40 పైసల చొప్పున డిస్కంలు వినియోగదారుని నుంచి వసూలు చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఎఫ్‌పీపీసీఏ కింద యూనిట్‌కు గరిష్ఠంగా 40 పైసల చొప్పున వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏప్రిల్‌లో రూ.288 కోట్ల ఎఫ్‌పీపీసీఏ భారం వినియోగదారులపై ప్రభుత్వం వేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని