ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!

ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్‌ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు.స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం.

Updated : 25 Apr 2024 13:54 IST

ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్‌ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు.
స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. వంకపెట్టలేని పనితీరుతో ప్రజావిశ్వాసాన్ని పొందాల్సిన ఖాకీల వెన్నెముకలను జగన్‌మోహన్‌రెడ్డి విరిచేశారు. వారిని వైకాపా సేవకులుగా మార్చేశారు. ప్రజలను పీడించడం తప్ప ప్రేమించడం తెలియని జగన్‌- ఏపీ పోలీస్‌ యంత్రాంగాన్నీ తనలానే కర్కశంగా తయారుచేసి, జనానికి కనీస రక్షణ లేకుండా చేశారు. ప్రతిపక్షాలూ అసమ్మతివాదులను అనుక్షణం వెంటాడి వేధించే దుర్మార్గపు పనికి ఖాకీలను వాడుకున్నారు. రాజ్యాంగం, చట్టాలను కాలదన్ని తమ మాటే శాసనంగా చలామణీ చేసుకున్నారు.

నోరెత్తితే చావబాదుడే...

ప్రజల భావప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇస్తోంది. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు సైతం రాజ్యాంగదత్తమైనదే. కానీ, జగన్‌ అరాచక రాజ్యంలో వీటికి చోటులేదు. ప్రభుత్వ పనితీరును విమర్శించడం, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం వంటివి అంటేనే వైకాపా అధినేతకు ఒళ్లు మంట. అందుకే గడచిన అయిదేళ్లలో ఎవరు రోడ్డెక్కినా ఆయన పోలీసులను ఉసిగొల్పారు. ఎయిడెడ్‌ కళాశాలల ప్రైవేటీకరణను నిరసించిన విద్యార్థులను చావబాదించారు. పోరుబాట పట్టిన ఉపాధ్యాయులపైనా ఉక్కుపాదం మోపారు. పంచాయతీల పీకనులమవద్దన్న సర్పంచ్‌లను అష్టదిగ్బంధనం చేశారు. అసమ్మతివాదులపై తప్పుడు కేసులు మోపుతున్నారని ఏపీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి బాధ్యులు గవర్నర్‌కే మొరపెట్టుకున్నారు. జగన్‌ ఏకపక్ష ఏలుబడిలో న్యాయంకోసం నిలదీసిన లక్షలాది మందిపై లాఠీలు విరిగాయి. ముక్కారు పంటలు పండే పచ్చటి భూములను రాష్ట్రంకోసం నిస్వార్థంగా వదులుకున్న అమరావతి రైతులపైనైతే పోలీసులతో దండయాత్రలు చేయించారు జగన్‌. ‘‘మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న విషయం మీకు గుర్తుందా’’ అని రాష్ట్ర హైకోర్టు ఆగ్రహించేంతగా రాజధాని గ్రామాల్లో భయోత్పాతం సృష్టించారు. ఇక తెలుగుదేశం, జనసేన నేతలూ కార్యకర్తలనైతే ఎక్కడికక్కడ రాచిరంపాన పెట్టించారు. కదిలితే కేసు, మెదిలితే సంకెళ్లు అన్నట్లు గృహ నిర్భందాలూ అరెస్టులకు పాల్పడి తానెంతటి నిరంకుశుణ్నో జగన్‌ నిరూపించుకున్నారు.

ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా పోలీసులు చాలామంది జగన్‌ సేవలోనే తల మునకలయ్యారు. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై వైకాపా గూండా గుంపులు దాడులు చేస్తుంటే అడ్డు కోవాల్సిన ఖాకీలు ఏం చేస్తున్నారు? ఆ రక్కసి మూకలకే జీ హుజూర్‌ అంటూ, వాటికే రక్షణ కల్పిస్తున్నారు. పోలీసులను పక్కనపెట్టుకుని రౌడీ రాజకీయాలు చేస్తున్న జగన్‌ పార్టీ - రాష్ట్రంలో ప్రజాస్వామ్య హంతకిగా తయారైంది. తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నట్లు రాజ్యాంగ నిబంధనలకు పూచికపుల్ల పాటి విలువ ఇవ్వని జగన్‌ - వ్యవస్థలనూ అలాగే పాడుచేశారు. తన ఖాకీ భక్తులతో కలిసి రాష్ట్రంలో మానవ హక్కులకు నిప్పెట్టారు. జగన్‌ పార్టీతో జుగ ల్బందీ చేసిన కొందరు అధికారులపై వేటు పడింది. అయినప్పటికీ జగన్‌ చేతుల్లో తోలుబొమ్మలై ఆడుతున్న పోలీసుల్లో ఎంతమాత్రం మార్పు రావట్లేదు.


కొందరు పోలీసు అధికారుల పక్కతాళం

ఆత్మగౌరవం లేనివారు నియంతలను ఆరాధిస్తారు. కిరాతక నేతల చెప్పుచేతల్లో మసులుతూ ప్రజాస్వామ్య ప్రమాణాలను పూడ్చిపెడతారు. ఏపీలో ఆ పని పోలీసు బాసులే చేశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించినప్పుడు రౌడీమూకలు కొన్ని ఆయన కాన్వాయ్‌పై రాళ్లు విసిరాయి. దాన్ని ‘రాజ్యాంగబద్ధమైన భావప్రకటన స్వేచ్ఛ’గా అభివర్ణించిన నాటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌- జగన్‌ సేవే జనం సేవ అని తమ సిబ్బందికి సంకేతాలిచ్చారు. మాచర్లలో తెదేపా కార్యాలయం, ఆ పార్టీ నేతల నివాసాలను వైకాపా గూండాలు తగలబెట్టినప్పుడు- బాధితులమీదే తాడెత్తున లేచారు డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి. తెదేపా కేంద్ర కార్యాలయంపై జగన్‌ పిశాచగణాలు దాడికి దిగినప్పుడూ పోలీసులు స్వామిభక్తితో కళ్లూచెవులూ మూసుకున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతిచోటా వైకాపా విధ్వంసాలూ బెదిరింపులూ బరితెగింపుల పర్వాలకు ఖాకీలు పక్కతాళాలు వాయించారు. కరోనా రోజుల్లో మాస్కులైనా లేకుండా ఎలా పనిచేయాలని నిలదీసిన దళిత డాక్టర్‌ సుధాకర్‌ను జగన్‌ సర్కారు అమానుషంగా వేటాడింది. నడిరోడ్డు మీద పోలీసులతో కొట్టించి, ఆయనపై పిచ్చివాడన్న ముద్ర వేసింది. ఆఖరికి సుధాకర్‌ ప్రాణాలను బలితీసుకుంది. తన అధ్వాన పాలనను వేలెత్తిచూపించినందుకు సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజునూ జగన్‌ వదల్లేదు. పోలీసులను పురమాయించి ఆయనను అరెస్టు చేయించారు. ఎంపీని నిర్బంధించి అతిదారుణంగా హింసించారు. విమర్శకుల నోళ్లను లాఠీలతో మూయించడమే కాదు- విపక్ష నేతల కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డంకుల సృష్టించేందుకూ తన అంధ భక్తులైన ఖాకీలనే ఉపయోగించుకున్నారు జగన్‌. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పర్యటనలకు అలాగే అడ్డంపడ్డారు. అధికారపక్షాలతో అంటకాగే పోలీసు అధికారులు ఆ తరవాత చాలా సమస్యలు ఎదుర్కొంటారని సాక్షాత్తూ సుప్రీంకోర్టే మొన్నామధ్య హెచ్చరించింది. తన భక్తిగీతాలాపనలో మునిగిపోయేలా యంత్రాంగాన్ని తీర్చిదిద్దుకున్న జగన్‌ పుణ్యమా అని ఏపీ ఖాకీలకు ఇటువంటి హితోక్తులేవీ చెవినపడలేదు. విపక్ష సభ్యులపై అక్రమ కేసుల బనాయింపు  ఆగలేదు. నోరూవాయి లేని అభాగ్యులను వేధించి, వారిలో కొందరిని ఆత్మహత్యలకు పురికొల్పిన పోలీసులు- ఎన్నో కుటుంబాలను కన్నీళ్లలో ముంచేశారు. రాష్ట్రాన్ని తాలిబన్ల రాజ్యం చేశారని జనమంతా చీదరించుకుంటుంటే జగన్‌ ఏమో పోలీసుల పనితీరు మెరుగుపడిందని మురిసిపోయారు. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్ఛబోయిందట! జగన్‌, పోలీసుల అనుబంధమూ అచ్చం అలాగే ఉంది!


వైకాపా యూనిఫామ్‌ వేస్తే పోలా!

జగమెరిగిన జనకంటకుడు జగన్‌ జమానాలో శాంతి లేదు... ప్రజలకు భద్రత అంతకంటే లేదు. ‘‘నిబంధనలను తొక్కిపెట్టి ఎలా అరెస్టు చేస్తారు? ఠాణాకు తీసుకెళ్లి కొట్టడమేంటి... రాష్ట్రంలో ఏం జరుగుతోంది... ఇలాగైతే సామాన్యుల పరిస్థితి ఎలా?’’ అంటూ కట్టలుతెంచుకున్న ఖాకీ క్రౌర్యంపై రాష్ట్ర హైకోర్టే నిప్పులు చెరిగింది. ‘‘రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా ఉందా లేదా అని అనుమానమేస్తోంది’’ అని మరో కేసులో ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వెలిబుచ్చింది. జగన్‌ ఏలుబడిలో హద్దులుమీరిన రాజ్యహింసపై న్యాయపాలిక అభిశంసనలు ఇవి! అయినా వైకాపా అధినేతలో ఉలుకులేదు... పలుకులేదు.  పోలీస్‌ యూనిఫామ్‌కు రాజకీయ మరకలు అంటించిన జగన్‌- ఖాకీ బట్టలు వేసుకునేందుకు రాష్ట్ర పోలీసుల్లో చాలా మందిని అనర్హులను చేశారు. వాటికి బదులు తెల్ల చొక్కా, బులుగు ప్యాంటు, బులుగు బెల్టు, ఆకుపచ్చ టోపీ ధరిస్తే- జగన్‌ కిరాయిసైన్యంగా వారి ‘డ్యూటీ’కి అతికినట్లు ఉండేది. ముఖ్యంగా ఏపీ సీఐడీకి వైకాపా యూనిఫామ్‌ బాగా నప్పుతుంది. ప్రజావ్యతిరేక వైకాపా ప్రభుత్వానికి జీహుజూర్‌ అననివారిని చెండుకుతినే  ప్రత్యేక బాధ్యతలను సీఐడీ సిబ్బంది ఈ అయిదేళ్లలో చాలా నిష్ఠగా నిర్వర్తించారు. అందుకోసమే ప్రజాధనంతో జీతాలిచ్చి జగన్‌ వారిని ప్రేమగా పోషించారు.


అవినాష్‌పై అలవిమాలిన ప్రేమ

‘‘మీ విధులను నిజాయతీ, చిత్తశుద్ధితో నిర్వర్తించండి’’ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులకు జగన్‌ పాఠాలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఏమో వైకాపాకు ఊడిగం చేయడమే పోలీసుల చిత్తశుద్ధికి కొలమానం అన్నట్లుగా ప్రవర్తించారు.  ప్రజారక్షకులను ప్రజాస్వామ్య హంతకులుగా మార్చిన ఘనత కూడా జగన్‌ పార్టీ ఖాతాలో పడింది. తటస్థులు, తెదేపా సానుభూతిపరుల ఓట్ల తొలగింపు కుట్రకు తెరలేపిన ఒక సీఐ, ముగ్గురు ఎస్‌ఐల బండారం పర్చూరులో బట్టబయలైంది. పోలీసుల దన్నుతో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకూ వైకాపా నాయకులు తెగబడ్డారు. ప్రతిపక్ష నేతలూ కార్యకర్తలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు చేసేవారికి బేడీలు వేసేందుకు జగన్‌ పెంపుడు పోలీసులు సినిమా సాహసాలెన్నో చేశారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర ఇళ్ల దగ్గర వీరంగాలాడి మరీ వారిని అరెస్టు చేశారు. ఫేస్‌బుక్‌లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టును షేర్‌ చేసినందుకు రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై అన్యాయంగా కేసు నమోదుచేశారు. ఆ పెద్దావిడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాష్ట్రం వదిలి వెళ్లిపోయేంతగా వేధించారు. జగన్‌ విమర్శకులపై విరుచుకుపడిన  అదే పోలీసు వీరులు- వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్‌ అరెస్టుకు సహకరించమని సీబీఐ అడిగితే చేతులెత్తేశారు.  సీబీఐ అధికారిపైనే కేసు పెట్టించడం ద్వారా ఏపీ పోలీసుల దుష్కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని వైకాపా తగిలించింది. సీబీఐని ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించిన జగన్‌ రాక్షస రాజ్యం ధాటికి వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీ అయ్యింది. దాంతో మూటగట్టుకున్న అప్రతిష్ఠ చాలదన్నట్లు- దళితుణ్ని చంపి డోర్‌డెలివరీ చేసిన జగన్‌ అంతేవాసికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి, ఆయనతో ఫొటో దిగి, తమ జీవితాలను చరితార్థం చేసుకున్నారు  ఖాకీలు. వైకాపా నేతాగణాలకు పొర్లుదండాలు పెట్టడంలో వారి సిగ్గుమాలినతనం గురించి ఎంత చెప్పినా తరిగేది కాదు. పోలీసు వ్యవస్థను ఇంతగా భ్రష్టుపట్టించిన జగన్‌ వంటి ముఖ్యమంత్రి- ఇంతకు ముందు ఎవరూ లేరు, భవిష్యత్తులో మరెవరూ రారు!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని