కొత్తవారొచ్చారు

ఆంధ్రప్రదేశ్‌ నిఘా విభాగాధిపతిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కుమార్‌ విశ్వజిత్‌ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.

Updated : 25 Apr 2024 07:01 IST

నిఘా విభాగాధిపతిగా కుమార్‌ విశ్వజిత్‌
విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ
నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులుగా వీరికి గుర్తింపు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నిఘా విభాగాధిపతిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కుమార్‌ విశ్వజిత్‌ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరు తక్షణమే బాధ్యతల్లో చేరాలని ఆదేశించింది. విధుల్లో చేరినట్లుగా కంప్లెయిన్స్‌ రిపోర్టును గురువారం ఉదయం 11 గంటల్లోగా పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌ కుమార్‌ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. వైకాపాతో అంటకాగుతూ..అయిదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వారి స్థానాల్లో కుమార్‌ విశ్వజిత్‌, పీహెచ్‌డీ రామకృష్ణను ఎన్నికల సంఘం నియమించింది.

విమర్శలకు తావివ్వని విశ్వజిత్‌..

కుమార్‌ విశ్వజిత్‌ 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం రైల్వే విభాగం అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా విమర్శలకు ఆస్కారమివ్వకుండా నిబంధనల ప్రకారం పనిచేస్తారనే పేరుంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ... ఈసీ ఈయన్నే నిఘా విభాగాధిపతిగా నియమించింది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చాక కూడా నాలుగైదు  నెలల పాటు అదే పోస్టులో కొనసాగారు. ఆ తర్వాత ఆయనను ఆ పోస్టు నుంచి తప్పించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీజీగా, ఏసీబీ డీజీగా పనిచేశారు. ఒత్తిళ్లకు తలొగ్గరనే పేరుంది. నిఘా విభాగాధిపతిగా విధులు చేపట్టడం ఇది రెండోసారి.

ముక్కుసూటి.. ఒత్తిళ్లకు తలొగ్గని అధికారిగా పీహెచ్‌డీ రామకృష్ణకు గుర్తింపు: 2001 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన పీహెచ్‌డీ రామకృష్ణ... డీఐజీ స్థాయి అధికారి. ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. నిబంధనల ప్రకారం పనిచేస్తారనే గుర్తింపు తెచ్చుకున్నారు. తటస్థంగా ఉంటారు. గతంలో చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ఒత్తిళ్లకు తలొగ్గరనే పేరుంది. చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసిన సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ ముఠాలను పట్టుకోవడంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. గతంలో నిఘా విభాగంలోనూ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధిపతిగానూ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఏసీబీలో డైరెక్టర్‌గా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని