సంక్షిప్తవార్తలు(6)

సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్‌ను పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఉత్తర్వులిచ్చింది.

Updated : 25 Apr 2024 07:02 IST

గులకరాయి కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్‌ను పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఉత్తర్వులిచ్చింది. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న నిందితుడిని వారం రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. పిటిషన్‌పై మంగళవారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. కస్టడీకి అనుమతిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయన్న ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ మూడు రోజులు కస్టడీకి ఇస్తూ న్యాయాధికారి రమణారెడ్డి బుధవారం ఆదేశాలిచ్చారు.


26 నుంచి కేఎల్‌యూ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: విజయవాడ, హైదరాబాద్‌ కేఎల్‌ వర్సిటీ క్యాంపస్‌ల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల ప్రవేశానికి ఈ నెల 26 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి పార్థసారథివర్మ తెలిపారు. ఆ రోజు ఉదయం 9గంటల నుంచి వడ్డేశ్వరంలోని యూనివర్సిటీ సీ బ్లాక్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేఎల్‌యూ నిర్వహించిన ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థులతోపాటు ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. కేఎల్‌ ర్యాంకులు, ఇంటర్‌ మార్కులు, జేఈఈ మెయిన్స్‌ ర్యాంకుల ఆధారంగా పది శాతం నుంచి వంద శాతం వరకు ఉపకార వేతనాలు ఇస్తామని తెలిపారు.


ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్‌

రాజమహేంద్రవరం (వి.ఎల్‌.పురం), న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరుమిల్లు యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో  కార్మికులు ఆందోళనకు దిగారు. పాత వేతన ఒప్పందం 2020 జూన్‌ 30తో ముగియడంతో కొత్తవేతన ఒప్పందం అమలు చేయాలంటూ కార్మికులు దఫదఫాలుగా ఆందోళనలు చేస్తున్నారు. గత నెల 26న యాజమాన్యానికి సమ్మె నోటీసిచ్చారు. ఈ నెల 2 నుంచి 2,800 మంది సమ్మె చేస్తున్నారు. దీనిపై తేల్చకుండా లాకౌట్‌ ప్రకటించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


జూన్‌ 2లోపు జరిగే ప్రవేశ పరీక్షల వరకే ఉమ్మడి ప్రవేశాలు
తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: జూన్‌ రెండో తేదీ లోపు జరిగే ప్రవేశ పరీక్షలు రాసే ఏపీ విద్యార్థులకు తెలంగాణ విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేేశాలు కల్పిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. బుధవారం తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వెల్లడి అనంతరం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ప్రవేశాల అమలు గడువు వచ్చే జూన్‌ రెండో తేదీతో ముగుస్తుందన్నారు. ఆ తర్వాత తెలంగాణ వారికే స్థానికత వర్తిస్తుందని, ఏపీ విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసినా వారికి ఇక్కడి విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఉండవని వెల్లడించారు.


ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష, రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌కు రుసుము చెల్లించే గడువును ఈ నెల 30 వరకు ఇంటర్‌ బోర్డు పొడిగించింది. తొలుత ఇచ్చిన గడువు బుధవారంతో ముగియగా.. తాజాగా పొడిగించింది. మరోసారి అవకాశం ఉండదని స్పష్టం చేసింది.


అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ ప్రవేశాలకు ప్రకటన
నేటి నుంచి వెబ్‌ ఆప్షన్లు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. గురువారం నుంచి ఈనెల 30 వరకు వెబ్‌ఆప్షన్‌, ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని వర్సిటీ అభ్యాసక సహాయ సేవా విభాగం డైరెక్టర్‌ ఎల్‌.కృష్ణారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 5న యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైనవారు మాత్రమే ప్రవేశాలు పొందడానికి అర్హులని పేర్కొన్నారు. ప్రవేశాలు పొందిన అభ్యర్థుల జాబితా మే 8న ప్రకటిస్తామని తెలిపారు.మరిన్ని వివరాలకు www.braouonline.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని