929 మంది వాలంటీర్లను తొలగించాం

ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్‌)ని ఉల్లంఘించినందున 929 మంది వాలంటీర్లను తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ హైకోర్టుకు నివేదించారు.

Published : 25 Apr 2024 05:46 IST

62,571 మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు
రాజీనామాలను ఆమోదించొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేం
హైకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం

ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్‌)ని ఉల్లంఘించినందున 929 మంది వాలంటీర్లను తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ హైకోర్టుకు నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 62,571 మంది వాలంటీర్లు రాజీనామా చేశారన్నారు. పిటిషనర్‌ కోరిన విధంగా ఎన్నికలు ముగిసేవరకూ రాజీనామాలను ఆమోదించొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేమన్నారు. ఐఏఎస్‌ అధికారులే ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీచేస్తున్నారని తెలిపారు. ఈ వ్యాజ్యంలో కౌంటర్‌ వేయడానికి సమయం కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. ఏపీలో ఎన్నికలు ముగిసేవరకూ వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా రాష్ట్రప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు బి. రామచంద్రయాదవ్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలుచేసిన విషయం తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.

ఖజానాపై భారం: ప్రభుత్వ న్యాయవాది

రాష్ట్రప్రభుత్వం తరఫు న్యాయవాది సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఈసీ ఆదేశాల నేపథ్యంలో వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించలేదు. వాళ్లు ఏ పనీ లేకుండా ఖాళీగా కూర్చుంటున్నారు. అయినా గౌరవవేతనం చెల్లిస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది’ అన్నారు.

ఈసీ మౌనం తగదు: న్యాయవాది ఉమేశ్‌చంద్ర

పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. ‘రాజీనామాలు చేసిన వాలంటీర్లు అధికారపార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈసీ మౌనంగా ఉండటం తగదు. ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి రాజీనామాలను ఆమోదించొద్దంటూ ఆదేశాలు ఇచ్చే అధికారం ఈసీకి ఉంది. ఈసీ కౌంటర్‌ దాఖలు చేశాక ఈ విషయాన్ని తేల్చాలి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంది’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని