చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్‌?

‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు.

Updated : 25 Apr 2024 07:11 IST

వివేకా హత్యపై షర్మిల, సునీత సూటి ప్రశ్నలు

‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. హంతకుడిని గెలిపించకుండా.. చట్టసభల్లోకి వెళ్లకుండా చేయాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. ప్రజలారా ఆలోచించండి’.

ఇటీవల పులివెందుల బహిరంగసభలో షర్మిల, సునీతల విన్నపం.

ఈనాడు, కడప: తరచూ ‘నా అక్కచెల్లెమ్మలు’ అని చెప్పే జగన్‌కు నిజంగా వారిపై ఉన్న ప్రేమ ఎంత? సొంత చెల్లెమ్మలకే న్యాయం చేయనప్పుడు.. ఇతరులకేం చేస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. సొంత అన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా ఇద్దరు చెల్లెమ్మలు కొంగు చాచి ప్రజలను కోరుకోవాల్సిన పరిస్థితి ఏమిటి? అంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు. అన్నగా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్‌ వీటన్నింటికీ సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి లక్ష్మణుడిలా ఉండే తమ్ముడు వివేకానందరెడ్డి. సాక్షాత్తు సీఎం జగన్‌కు చిన్నాన్న అయిన ఆయన దారుణహత్య జరిగి అయిదేళ్లయింది. న్యాయం కోసం తాము పోరాడుతున్నా.. హంతకులకు జగన్‌ అండగా ఉంటున్నారని ఆయన చెల్లెళ్లు షర్మిల, సునీత వాపోతున్నారు. సొంత చెల్లెమ్మలకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలకు పారదర్శక పాలన ఎలా అందిస్తారని ఆ ఇద్దరూ ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను ఓడించాలని ప్రజలను కోరుతున్నారు. వీటికి సమాధానం చెప్పేవారు లేకపోగా, ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నారంటున్నారు. పైగా కుటుంబ పరువును బజారున పడేస్తున్నారంటూ మేనత్త విమలారెడ్డిని రంగంలోకి దించి విమర్శలు చేయిస్తున్నారు.

నిందితులకు రక్షణ కల్పిస్తారా?

బాబాయ్‌ హత్యకేసులో ఆరోపణలున్న అవినాష్‌రెడ్డి అరెస్టు కాకుండా కాపాడుతున్న జగన్‌.. ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారేమని షర్మిల, సునీత ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్యపై మాట్లాడరాదంటూ కడప కోర్టును వైకాపా నేతలు ఆశ్రయించడం, ఈ మేరకు ఉత్తర్వులు రావడం చర్చనీయాంశమైంది. కడప కోర్టు ఉత్తర్వులపై సునీత ఉన్నత న్యాయస్థానంలో న్యాయపోరాటానికి దిగారు.

సానుభూతికి ప్రయత్నం

‘వివేకా చిన్నాన్నను అతి దారుణంగా చంపి.. హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడు’ అని ప్రొద్దుటూరు సిద్ధం సభలో దస్తగిరిని ఉద్దేశించి జగన్‌ అన్నారు. చిన్నాన్నను అన్యాయంగా చంపారంటూనే.. రాజకీయంగా తనపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని సానుభూతి పొందే ప్రయత్నం చేశారని విమర్శలు వస్తున్నాయి. సొంత చిన్నాన్నను హత్య చేస్తే... నిందితులను వెనకేసుకొచ్చే వాళ్లున్నారని ఈ కలియుగంలోనే చూస్తున్నామంటూ జనం నుంచి వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.

సమాధానాల కోసం జనం ఎదురుచూపులు

వివేకా హత్య, అయిదేళ్లుగా నిందితులకు శిక్ష పడకపోవడం, నిందితుడు అవినాష్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడం, వీటిపై పోరాటంతోనే ప్రజాక్షేత్రంలోకి వచ్చామంటూ షర్మిల, సునీత రంగంలోకి దిగడంపై చర్చ సాగుతోంది. మరోవైపు వివేకా హత్య కేసులో అప్రూవర్‌ మారిన దస్తగిరి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. వివేకా హత్యకు ముందు అవినాష్‌రెడ్డి ఫోన్‌ ద్వారా తనతో జగన్‌ మాట్లాడారని.. మావాళ్లు ఏం చెబితే. అది చెయ్యి.. అన్నీ తాను చూసుకుంటాననే భరోసా ఇచ్చారని అన్నారు. ఈ ప్రశ్నలు.. అనుమానాలు తలెత్తిన తర్వాత పుట్టినగడ్డపై గురువారం జరిగే బహిరంగసభ నుంచే జగన్‌ స్పందిస్తారని.. ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ సార్వత్రిక ఎన్నికల తరుణంలో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని