గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?

‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్‌బాబు ఆత్మకూరు ఛైర్‌పర్సన్‌గా చేశారు.

Published : 25 Apr 2024 05:48 IST

‘యానాదోళ్ల అమ్మాయి’ అంటూ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దుర్భాషలు
ఫిర్యాదు అంది 5 రోజులవుతున్నా కేసు పెట్టని పోలీసులు
న్యాయసలహాకు పంపించామంటూ జాప్యం
ఎన్నికల కోడ్‌ ఉన్నా.. వైకాపా కోడ్‌నే అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు

ఈనాడు-నెల్లూరు, న్యూస్‌టుడే-ఆత్మకూరు: ‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్‌బాబు ఆత్మకూరు ఛైర్‌పర్సన్‌గా చేశారు. ఇప్పుడు డబ్బులిస్తే ఆ పార్టీలో చేరారని అంటున్నారు’’ అని ఆత్మకూరు పురపాలక ఛైర్‌పర్సన్‌ గోపారం వెంకట రమణమ్మను ఉద్దేశించి మాజీ ఎంపీ, వైకాపా నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ నెల 17న మర్రిపాడు మండలం అల్లంపాడులో నిర్వహించిన రచ్చబండలో వ్యాఖ్యానించారు. దీనిపై వెంకటరమణమ్మ ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదుచేసినా ఇప్పటివరకూ కేసే నమోదుచేయలేదు. ఫిర్యాదును న్యాయసలహా కోసం పంపించామని, అది అందాక కేసు విషయం చూస్తామని చెబుతున్నారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్న గిరిజన మహిళను వైకాపా నేత దూషిస్తే ఎందుకు కేసు నమోదుచేయట్లేదు? 5 రోజుల సమయం చాల్లేదా? వైకాపా నేతలపై ఫిర్యాదులొస్తే కేసు నమోదుచేయరా? అన్న విమర్శలు వస్తున్నాయి.

వైకాపా నాయకులు చెప్పిందే చట్టం

గతంలో ఆత్మకూరు నియోజకవర్గంలో అధికారపార్టీ అక్రమాలను ప్రశ్నించినవారిపై అక్రమంగా కేసులు నమోదుచేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఆత్మకూరు మండలం అప్పారావుపాళెంలో వైకాపా నాయకులు ఇరిగేషన్‌ పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసేందుకు యత్నించారని.. తెదేపా సానుభూతిపరుడు మల్లికార్జుననాయుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలనకు ఇరిగేషన్‌ ఎస్‌ఈ కృష్ణమోహన్‌ వచ్చినప్పుడు.. విచారణ సక్రమంగా జరగకూడదనే ఉద్దేశంతో వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. అదే గ్రామంలో పంచాయతీ సమావేశం జరగ్గా.. అక్కడకు మల్లికార్జుననాయుడు వెళ్లారు. అక్కడ పంచాయతీ కార్యదర్శి అధికారపార్టీ నాయకుల ప్రోద్బలంతో ఆయన్ను అడ్డుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు.

మర్రిపాడు మండలంలో ఓ వ్యక్తి ప్రభుత్వభూమిని ఆక్రమించి కొన్నేళ్లుగా సాగు చేసుకుంటుండగా.. దానికి వైకాపా నాయకులు పట్టాలు పుట్టించుకుని, మరొకరికి విక్రయించారు. దీనిపై బాధితుడు ప్రశ్నించగా.. గొడవకు దిగి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారు. వార్తలను రాసిన విలేకరిపైనా అక్రమంగా కేసు నమోదుచేశారు. దీనిపై విచారణ చేసి డీఎస్పీ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే.. కోర్టుకు ఛార్జిషీటు సమర్పించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆర్డీఓ ఫిర్యాదునే పక్కనపెట్టి..

కలువాయి మండలంలో కొందరు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి.. అటవీ భూములకు పట్టాలు పుట్టించారు. వాటిని చూపి ప్రభుత్వం నుంచి రూ.1.43 కోట్ల పరిహారం పొందారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విచారణ చేసిన ఆత్మకూరు ఆర్డీవో వాస్తవమని తేల్చారు. దీనికి సహకరించిన తహసీల్దార్లు వై.నాగరాజు, వి.లావణ్య, ఎస్‌.ఎం.హమీద్‌లను సస్పెండ్‌ చేశారు. మరో 9మందిపై క్రిమినల్‌ కేసు పెట్టాలని ఆర్డీవో కరుణకుమారి 2023 జనవరి 23న కలువాయి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఈ కేసులో అక్రమార్కులు వైకాపా నాయకులను ఆశ్రయించడంతో.. ఆ కేసును పక్కన పడేశారు. పైగా అక్కడ డీఎస్పీ కోటారెడ్డి.. ఆర్డీవో ఫిర్యాదుపైనే అనుమానాలు వ్యక్తం చేయడం వైకాపా నాయకుల పట్ల ఆయన స్వామిభక్తికి నిదర్శనం. నెల్లూరులో తొమ్మిదేళ్లు ఎస్‌బీలో పనిచేసిన ఆయనకు.. ఆత్మకూరు డీఎస్పీగా పోస్టింగ్‌ ఇప్పించినవారికి కృతజ్ఞతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


కులం పేరుతో అవమానకరంగా మాట్లాడారు

‘‘వైకాపా విధానాలు నచ్చక ఇటీవల నేను తెదేపాలో చేరాను. ఈ నెల 17న మేకపాటి రాజమోహన్‌రెడ్డి అల్లంపాడులో జరిగిన కార్యక్రమంలో నా కులం పేరెత్తి అవమానకరంగా మాట్లాడారు. ప్రజలందరి ముందు నన్ను అవమానించారు. ‘యానాది కులంలో పుట్టిన..’ అంటూ కులం పేరుతో దూషించడమే కాకుండా డబ్బులకు అమ్ముడుపోయానని నన్ను దూషించారు. ఈ విషయం పేపరు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసి నేను మానసికంగా కుంగిపోయాను. వారు ధనవంతులు, బలవంతులు కావడంతో నిరుపేదరాలైన నాకు భయంగా ఉంది.’’

ఆత్మకూరు పురపాలక ఛైర్‌పర్సన్‌ గోపారం వెంకట రమణమ్మ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు