ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు

ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలట్‌ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు.

Published : 25 Apr 2024 05:49 IST

ఈనాడు, అమరావతి: ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలట్‌ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. కొంతమంది మాత్రం జిరాక్స్‌ ప్రతులపై స్టాంప్‌ వేయించుకొని తీసుకుంటున్నారు. రశీదు ఇవ్వకపోవడంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. పోలింగ్‌ అధికారులు(పీఓ), సహాయ పోలింగ్‌ అధికారులకు (ఏపీఓలకు) శిక్షణ సమయంలోనే పోస్టల్‌ బ్యాలట్‌ దరఖాస్తుకు ఫాం-12 ఇచ్చారు. ఇతర పోలింగ్‌ అధికారులకు(ఓపీఓ) ఫాం-12 ఇచ్చారు. వీటిని ఉద్యోగులు పని చేస్తున్న ప్రాంతంలో సహాయ రిటర్నింగ్‌ అధికారులకు(ఏఆర్‌ఓ) సమర్పించే అవకాశం కల్పించినా వీటికి రశీదు ఇవ్వడం లేదు. దీంతో ఓటింగ్‌ సమయంలో తమకు బ్యాలట్‌ ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల ఫాం-12ను తీసుకునేందుకు కొన్ని అసంబద్ధ సమాధానాలు చెబుతున్నట్లు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫాం-12 సమర్పణకు ఈ నెల 26 వరకు గడువు విధించారు. పోలింగ్‌ విధులు కేటాయించిన ఉద్యోగుల్లో చాలా మంది ఇంకా పోస్టల్‌ బ్యాలట్లు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గడువును ఈనెల 30వరకు పొడిగించాలని కోరుతున్నారు. అలాగే ఫాం-12 సమర్పిస్తే రశీదు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఓటు వేసేందుకు ఫెసిలిటేషన్‌ కేంద్రానికి వెళ్లిన సమయంలో బ్యాలట్‌ ఇవ్వకపోతే అడిగేందుకు ఆధారంగా రశీదు ఉంటుందని పేర్కొంటున్నారు. ఫెసిలిటేషన్‌ కేంద్రం వద్దకు వెళ్లిన తర్వాత పోస్టల్‌ బ్యాలట్లకు దరఖాస్తే సమర్పించలేదంటూ ఓటు ఇవ్వకపోయినా ప్రశ్నించేందుకు ఆధారం ఉండదని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని