ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!

ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం.

Published : 25 Apr 2024 05:51 IST

మైనింగ్‌ కమీషన్ల ఆరోపణలతో కాసు మహేష్‌రెడ్డి సతమతం
ఎన్నికల కోడ్‌ వచ్చే ముందే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
అయిదేళ్లు కాలయాపన చేయడంపై ప్రజల నుంచి విమర్శలు
ఉత్కంఠ రేపుతున్న గురజాల పోరు


ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం.

గురజాలకు చెందిన సిమ్‌ కార్డుల విక్రయదారు


పరిశ్రమల ఏర్పాటు.. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. విద్యుత్తు ఛార్జీలు భారీగా పెంచారు. ఒక ఫ్యాన్‌, ఒక లైట్‌కు నెలకు రూ.500 బిల్లు వస్తోంది.

పిడుగురాళ్లలోని ఓ హోటల్‌లో క్యాష్‌ కౌంటర్‌ ఉద్యోగి


గతంలో తెదేపా ఎమ్మెల్యేపై మైనింగ్‌ మాఫియా డాన్‌ అని ఆరోపణలు గుప్పించిన కాసు.. ఎమ్మెల్యే అయిన తర్వాత అవే ఆరోపణలకు కేంద్ర బిందువయ్యారు. పోనీ అభివృద్ధిని వేగవంతం చేశారా అంటే అదీ లేదు.

పిడుగురాళ్లకు చెందిన ఓ ఆటోమొబైల్‌ వ్యాపారి


ఎత్తిపోతల పథకాల ద్వారా దాచేపల్లి, మాచవరం మండలాల్లోని కొన్ని గ్రామాలకు సాగునీరు ఇస్తామని జగన్‌తో పాటు ఎమ్మెల్యే హామీలిచ్చారు. అవి మాయమాటలని అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అర్థమైంది.

దాచేపల్లి మండలం గామాలపాడుకు చెందిన రైతు


ఈనాడు, అమరావతి: పల్నాటి పౌరుషాల గడ్డ గురజాల నియోజకవర్గంలో ఎన్నికలంటే రణరంగమే.. హత్యలు, దౌర్జన్యాలతో ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ ప్రాంతంలో ఎన్నికల పోరుకు తెదేపా, వైకాపా అభ్యర్థులు ‘సై’ అంటున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాసు మహేష్‌రెడ్డి గెలిచిన నెల రోజుల్లోనే వైకాపా శ్రేణులు తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డాయి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అనేకమంది గ్రామాలు విడిచివెళ్లారు. అడ్డుకోవాల్సిన ఎమ్మెల్యే దాడులను ప్రోత్సహించారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఆయనే మరోసారి వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తెదేపా అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు ఏడోసారి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి లేమి.. మైనింగ్‌ వ్యాపారుల నుంచి కమీషన్ల వసూలు.. ఫ్యాక్షనిజానికి మళ్లీ ఆజ్యం పోశారన్న ఆరోపణలు మహేష్‌రెడ్డికి మైనస్‌గా మారాయి. ఈ అంశాలను యరపతినేని ఎండగడుతూ, తాను గెలిస్తే ఏం చేస్తానో తెలిపేలా ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు వైకాపా నుంచి తెదేపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణామూర్తి బీసీ సదస్సులు నిర్వహిస్తూ.. తెలుగుదేశం గెలుపునకు ప్రచారం చేస్తున్నారు. ఈసారి జనసేనతో పొత్తు ఉండటంతో యరపతినేనికి కాపు సామాజికవర్గం మద్దతు దక్కింది. ముఖ్యంగా దాచేపల్లిలో వారి బలం అధికం. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 12 వేలకుపైగా ఓట్లు వస్తే.. అందులో సగం దాచేపల్లి మండలం లోనివే. పలు గ్రామాల్లో వైకాపా శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోవడం, వర్గ విభేదాలు తదితర కారణాలతో గెలుపుపై తెదేపా ధీమాగా ఉంది. ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి నియోజకవర్గంలోని గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల పట్టణాలతో పాటు జానపాడులో పర్యటించి వివిధ వర్గాల ఓటర్లతో మాట్లాడారు. అభివృద్ధిపై అధిక శాతం మంది ప్రజలు పెదవి విరుస్తుండటం గమనార్హం.

హత్యా రాజకీయాలకు నిలయంగా మార్చి..

వైకాపా అధికారంలోకి వచ్చాక గురజాలను హత్యా రాజకీయాలకు నిలయంగా మార్చారు. గురజాల మండలం అంబాపురంలో తెదేపా నేత విక్రమ్‌ను వైకాపా శ్రేణులు నరికి చంపాయి. దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి, తెదేపా నేత అంకుల్‌ను హత్య చేశారు. ఈ అయిదేళ్లలో 11 మందిని వైకాపా హత్యలు చేసిందని, వారిలో కొందరిని వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా చేశారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. వాటిల్లో అనేక హత్యలు వ్యక్తిగత కక్షలతో జరిగాయని పోలీసులతో వైకాపా నేతలు చెప్పిస్తున్నారన్నది వారి వాదన. మొత్తానికి సమసిపోయిందనుకున్న ఫ్యాక్షనిజానికి మళ్లీ కాసు ఆజ్యం పోస్తున్నారన్న ప్రచారం ఉంది. గ్రామాలు వదిలి వెళ్లిన వారు ఇప్పుడిప్పుడే సొంతూళ్ల మొఖం చూస్తున్నారు.

అభివృద్ధి నిల్‌.. కమీషన్లు ఫుల్‌

గతంలో యరపతినేనిని మైనింగ్‌ మాఫియా డాన్‌ అని ఆరోపించిన కాసు.. అధికారంలోకి వచ్చాక సున్నపు రాయి మైనింగ్‌ను తన ఆదాయ వనరుగా మార్చుకున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. పిడుగురాళ్లకు మంజూరైన వైద్య కళాశాల పూర్తి కాకున్నా.. ఎన్నికలు వస్తున్నాయని, ప్రజలను మభ్యపెట్టేందుకు ఓ చిన్న బ్లాక్‌ను కట్టి ప్రారంభించారు. ఏళ్లుగా నాన్చి.. పిడుగురాళ్ల బైపాస్‌ను కూడా ఇటీవలే ప్రారంభించడం గమనార్హం. దీనికి సంబంధించి ఇంకా వంతెనలు పూర్తి కాలేదు. జానపాడు రోడ్డులో ఈ మధ్యే ఫ్లైఓవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇవన్నీ ఎన్నికల కోడ్‌ వచ్చే ముందే చేయటం విమర్శలకు తావిస్తోంది. గురజాలను పల్నాడు జిల్లా కేంద్రంగా చేసే అంశాన్ని ఎమ్మెల్యే కాసు పట్టించుకోలేదన్న అసంతృప్తి ఓటర్ల నుంచి వ్యక్తమవుతోంది. అదే సమయంలో తెదేపా అధికారంలోకి వస్తే గురజాల కేంద్రంగా జిల్లా చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తదితర హామీలతో వ్యక్తిగత మేనిఫెస్టోను యరపతినేని జనంలోకి తీసుకెళ్తున్నారు.


ఇంటింటికీ నీళ్లు ఏవీ?

నియోజకవర్గంలో ఇంటింటికీ రక్షిత నీరు సరఫరా చేస్తామని కాసు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు.. తీరాచూస్తే కేంద్ర పథకం జలజీవన్‌ మిషన్‌ కింద ఒకట్రెండు గ్రామాలకు ఇచ్చి సరిపెట్టారు. బుగ్గవాగు నుంచి పైపులైన్‌ ద్వారా పిడుగురాళ్ల, దాచేపల్లితో పాటు 57 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని కోతలు కోశారు. పిడుగురాళ్లలో ఒక్క ఇంటికీ ఇవ్వలేదు. మూడు ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల పనులు నిలిచిపోయాయి. ఎత్తిపోతల పథకాల ద్వారా మాచవరం, దాచేపల్లి మండలాల్లోని టెయిలెండ్‌ భూములకు సాగునీరు ఇస్తామని ప్రగల్భాలు పలికిన జగన్‌ ఆ ఊసే మర్చిపోయారు. పిడుగురాళ్లలో సున్నం వ్యాపారులపై గతంలో నమోదైన కేసుల్ని ఎత్తివేస్తామని ఇచ్చిన హామీనీ నెరవేర్చలేదు. దాచేపల్లి ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో అవకాశాలున్నా, వైకాపా సర్కారు పట్టించుకోలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని