హీరో ఎవరు? విలన్‌ ఎవరు?

‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్‌ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి.

Published : 25 Apr 2024 05:51 IST

గుణగణాలను గుర్తించండి
సీఎం జగన్‌ కొత్త పల్లవి
ఆఖరి రోజు బస్సు యాత్రకు సిక్కోలులో స్పందన కరవు

ఈనాడు- విశాఖపట్నం, ఈనాడు డిజిటల్‌- శ్రీకాకుళం, టెక్కలి, న్యూస్‌టుడే: ‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్‌ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. హీరో గుణగణాలు, చేసే మంచి కారణంగా మనవాడని అనుకుంటాం. మోసం, కుట్రలను చేసేవాడిని విలన్‌ అంటాం..’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో మొదలైన జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుధవారం ముగిసింది. ముగింపు సభలోనూ సంక్షేమ పథకాలపై ఊకదంపుడుకే ప్రాధాన్యమిచ్చారు. తనకు ఓటేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయంటూ బెదిరించే ధోరణిలో జగన్‌ ప్రసంగం సాగింది.

మోసాన్ని నిజాయతీతోనూ గెలవొచ్చు

‘మోసాన్ని మోసంతో జయించాలన్న రాజనీతిని మీ బిడ్డ అమలు చేయడు. మోసాన్ని నిజాయతీతోనూ జయించవచ్చని నిరూపించడానికి సిద్ధం’ అంటూ జగన్‌ టెక్కలిలో కొత్త రాగం అందుకున్నారు. ‘మీ నాయకుడు ఎవరని అడిగితే తలెత్తుకోలేని నాయకుడు కావాలా? కాలరెగరేసుకుని చెప్పుకొనే జగన్‌లాంటి నాయకుడు కావాలా?’ అంటూ ప్రశ్నించారు. ఏపీ పేరు చెబితేనే రాజధాని లేని రాష్ట్రమని అంతా నవ్వుకుంటున్నారు. రహదారులపై గుంతలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఉద్యోగాల్లేక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళుతోంది. ఇవన్నీ చూసి ఎలా తలెత్తుకుంటాం జగన్‌ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రత్యేక హోదాపై మీరేం చేశారు?

2014లో చంద్రబాబు కూటమి మ్యానిఫెస్టోను విస్మరించింది, ప్రత్యేక హోదా తేలేదని జగన్‌ అన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్‌ 2019 ఎన్నికల ముందు చెప్పారు. మరి అధికారం ఇచ్చిన అయిదేళ్లు ఏం చేశారో చెబితే అందరూ తెలుసుకునే వాళ్లు కదా? అన్న విమర్శలొచ్చాయి.  అధికారం దక్కిన మొదటి రోజు నుంచి ప్రతి రంగాన్ని ఎలా సిద్ధం చేశానో గమనించాలని జగన్‌ ప్రజలను కోరారు. గ్రామస్థాయిలో వ్యవసాయ రంగాన్ని సిద్ధం చేశానన్న సీఎం.. కొత్తగా ఎకరానికి నీరిచ్చిన దాఖలాల్లేవు. రైతుకు వెన్నెముకలాంటి సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎంత వెచ్చించారు? ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో సభలో చెప్పలేదు. శ్రీకాకుళంలో వంశధార కరకట్ట నిర్మాణం, కాలువల ఆధునికీకరణ, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌, రంగసాగరం ఎత్తిపోతల పూర్తి చేస్తామంటూ రెండేళ్ల కిందట ఆయనిచ్చిన హామీలకే దిక్కులేదన్న విమర్శలు వచ్చాయి.

మీకు తెలిసిన డోర్‌ డెలివరీ ఇదికాదు కదా?

ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఇంటింటికి డోర్‌ డెలివరీ చేసిన ప్రభుత్వ వ్యవస్థ ‘సిద్ధం’ అని జగన్‌ పేర్కొన్నారు. జగన్‌ బృందానికి తెలిసిన డోర్‌ డెలివరీ అంటే దళిత యువకుడిని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన చరిత్ర అని మరిచినట్లున్నారని టెక్కలి సభ వద్దనే కొందరు యువత విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదే విధంగా ఉత్తరాంధ్రపై.. ప్రధానంగా ‘నా విశాఖ’ అంటూ ప్రేమ గుప్పించారు. నమ్మి ఓట్లు వేసిన జనానికి అయిదేళ్లలో విధ్వంసం చూపించారు. జగన్‌ చేయలేని ఏ స్కీంను చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ కూడా చేయలేరని జగన్‌ వ్యాఖ్యానించారు. ఆయన స్కీంలు ఏమోకానీ, స్కాంలు ఎవరూ చేయలేరని ప్రతిపక్షాలు సామాజిక మాధ్యమాల్లో కౌంటర్‌ ఇచ్చాయి.


మరోసారి నరకమే

మేమంతా సిద్ధం సభను జాతీయ రహదారిని ఆనుకుని బీఎస్‌జేఆర్‌ డిగ్రీ కళాశాల పక్కన ఏర్పాటుచేశారు. సభకు మూడు కి.మీ. దూరంలో పరశురామపురం జంక్షన్‌ వద్ద మధ్యాహ్నం జగన్‌ బస ఏర్పాటుచేశారు. సాయంత్రం సభాప్రాంగణానికి ఆయన బయలుదేరారు. ఆ సమయంలో జాతీయ రహదారిపై తర్లిపేట, కన్నెవలస వరకు సుమారు ఐదు కి.మీ.మేర   3 గంటలపాటు ట్రాఫిక్‌ నిలిచింది. మరోవైపు జగతిమెట్ట కూడలి పైవంతెన, ఇరువైపులా సర్వీసు రోడ్లలో సుమారు కిలోమీటరున్నర మేర వాహనాలు నిలిచాయి.

విశాఖతోపాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలనుంచి వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులను సిద్ధం సభకు తరలించారు. ఎండ తీవ్రతకు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సభకు వచ్చిన ఒక్కొక్కరికీ రూ.300-400 ఇచ్చారు. కొన్ని ప్రాంతాల వారికి కూపన్లు ఇచ్చి తిరుగు ప్రయాణంలో డబ్బులిస్తామని చెప్పారు. ఇంతచేసినా సభ ప్రారంభానికి ముందే జనం వెనుదిరిగారు. చాలా మంది సభకు వెళ్లకుండా బస్సుల్లోనే ఉండిపోయారు.

జగన్‌ బస్సు యాత్ర ఆఖరి రోజు తుస్సుమంది. బుధవారం ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస నుంచి యాత్ర ప్రారంభమైంది. శ్రీకాకుళం కొత్త రోడ్డు వద్ద వైకాపా శ్రేణులు స్వాగతం పలికాయి. చాలా తక్కువగా జనం ఉండటంతో బస్సులోంచి కిందికి దిగడంతో పాటు టాప్‌పైకి ఎక్కి అభివాదం చేయలేదు. చాపురంలోనూ జనాల్లేక యాత్ర వెలవెలబోయింది. పాత్రునివలసలో క్యాడర్‌, జనాలు కనిపించలేదు. పెద్దపాడు వద్ద జనం లేకపోవడంతో సర్వీసు రోడ్లలో ట్రాఫిక్‌ను నిలిపేశారు. ఇక్కడ నిలిచిన వాహనదారులకు జగన్‌ అభివాదం చేశారు. మడపాం టోల్‌గేట్‌ వద్ద జగన్‌ రాక ఆలస్యమై అక్కడున్నవారు ఎండవేడి తాళలేక ఇబ్బందులు పడ్డారు.

సీఎం వస్తున్నారు.. సభకు వెళ్లండి

నందిగాం, న్యూస్‌టుడే: ‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్రలో భాగంగా టెక్కలి వస్తున్నారు. బుధవారం ఉదయం పని చేయండి. సాయంత్రం పనిలోకి రావొద్దు. మీ అందరి మస్తర్లు వేస్తాం. అందరూ సమావేశానికి వెళ్లండి’ అని ఉపాధిహామీ పథకం క్షేత్ర సహాయకులు వేతనదారులకు సూచించారు. కొందరు వేతనదారులు వారి ఆదేశాలను ప్రశ్నిస్తూ ‘మేం పనిలోకి వస్తాం. వచ్చిన వారికే మస్తరు వేయాలి’ అని పట్టుబట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని