అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!

ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్‌ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం..

Published : 25 Apr 2024 05:52 IST

జిల్లా మొత్తంగా నియోజకవర్గ  వైకాపా ప్రజాప్రతినిధి దందా
ఇల్లు కట్టాలంటే రూ.లక్ష నుంచి  రూ.5 లక్షలు ముట్టజెప్పాల్సిందే..
జగనన్న లేఅవుట్‌లలో పరిపరి విధాలుగా దోపిడీ
సర్కారు ఖజానాకే చిల్లు పెట్టిన ఘనుడీ నేత..

ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్‌ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం..

సముద్ర తీరం, గోదావరి తీరం కలగలిసిన ప్రాంతం అది. పశ్చిమ గోదావరి చివర్లో ఉన్న ఆ ‘పురం’ అక్కడి ప్రధాన వాణిజ్య కేంద్రం. బ్రిటిష్‌ హయాంలోనే ఆ ఊరికి ఎంతో పేరున్నా.. జిల్లా కేంద్రంగా అన్ని అర్హతలున్నా.. ఆ ప్రజాప్రతినిధి కృషి లేకపోవడంతో పునర్విభజనలో అవకాశం దక్కలేదు. ఈ నియోజకవర్గంలో ‘రాజు’గా వెలుగొందుతున్న ఆ నేతకు ప్రతిదీ ప్రసాదమే.. అన్నీ ఆరగించడమే! ఉభయగోదావరి జిల్లా ఇసుక ర్యాంపులన్నీ ఆయన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. ఆయన పనులన్నీ అధికారికంగానే కనిపించినా.. పరోక్షంగా లబ్ధి పొందుతారు. నరసాపురం, సఖినేటిపల్లి మధ్య గోదావరి పంటుకు వేలంపాట తప్పించి.. కొంతకాలం నిధుల పంట పండించుకొని ఖజానాకు జెల్లకొట్టారు.


జిల్లాలోని అన్ని ర్యాంపుల్లో దందా

ఇసుక అంటేనే పెద్ద ఆదాయ వనరు. వైకాపా సర్కారు ఏర్పడిన కొత్తలోనే ఆయనకు మంచి అవకాశం దక్కింది. రెండేళ్ల పాటు ఇసుకాసురుడి అవతారం ఎత్తారు. పార్టీలోని ఒక కీలక నాయకుడి అండదండలతో ఆ నియోజకవర్గంతోపాటు జిల్లాలోని అన్ని ర్యాంపుల్లో సొంత మనుషులను పెట్టుకుని దందా సాగించారు. రాష్ట్రంలో ఒకవైపు భవన నిర్మాణ కార్మికులు, సామాన్యులు ఇసుక దొరక్క నానా అవస్థలు పడుతుంటే.. ఆయన మాత్రం నిత్యం వేలాది ట్రాక్టర్లు, లారీల్లో సరిహద్దులు దాటించారు. అందులో పెద్దల వాటా పోగా.. మిగతా మొత్తంతో కోట్లకు పడగలెత్తారా నేత.


అక్రమాలకు అవే పెద్ద లేఅవుట్‌లు!

జగనన్న ఇళ్ల పట్టాలు ఆ ప్రజాప్రతినిధికి కాసుల వర్షం కురిపించాయి. నియోజకవర్గంలో జగనన్న లేఅవుట్ల కోసం ఎంజీపాలెం వద్ద స్థలాలను సేకరించారు. అంతకుముందే అక్కడ లేఅవుట్‌ వస్తుందని తెలుసుకొని, ఆ భూముల యజమానులతో అనధికారికంగా కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఒప్పంద ధరకు మించి ఎకరానికి రూ.10 లక్షలకు పైగా ఎక్కువ ధరకు ప్రభుత్వంతో కొనిపించారు. ఆ అదనపు సొమ్ములన్నీ ఆయనే మూటగట్టుకున్నారు. పైగా  ఈ లేఅవుట్‌ను చదును చేసేందుకు మట్టి తోలడం మరో దందా. తక్కువ సరఫరా చేసి.. ఎక్కువ లారీలు నమోదు చేసి ఆ బిల్లులనూ స్వాహా చేశారు. బయట నుంచి తవ్వి తెచ్చిన మట్టిని.. ఇతరులకు పెద్ద మొత్తానికి అమ్ముకోవడం ఇంకో బాగోతం.


పోలీసులకు ఆయనే ప్రభువు

నియోజకవర్గంలో పోలీసులు ఏదైనా కేసు నమోదు చేయాలంటే.. ముందు ఈ నేత అనుమతి తీసుకోవాల్సిందే. వైకాపా నాయకులు, కార్యకర్తల అరాచకాలపై కేసులుండవు. కొంత కాలం కిందట ఈ ప్రజాప్రతినిధికి ఓ ఎస్సై అనుంగు శిష్యుడిలా ఉండేవారు. పోలీస్‌స్టేషన్లోనే పంచాయితీలు చేసేవారు. అలా కొద్ది రోజుల్లోనే భారీగా సంపాదించుకున్నారు. ఎంతగా అంటే.. ఆ నేత ఇంటి నిర్మాణంలో పెద్ద ఎత్తున ప్రయోజనం కల్పించే స్థాయిలో ఈ దోపిడీ సాగింది. ఇప్పటికీ పోలీసు స్టేషన్లలో పంచాయితీలు చేసే వారంతా ఆయన అనుచరగణమే.


ఆపత్కాలంలోనూ కాసుల వేట

కొవిడ్‌తో ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఆ సమయంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ, అన్నదానం ముసుగులో భారీ దందాకు తెరతీశారీ ప్రజాప్రతినిధి. సేవా కార్యక్రమాల పేరిట నియోజకవర్గంలోని కొందరు బడా వ్యాపారులు, దుకాణదారులు, ఇతర సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రుల నుంచి భారీగా విరాళాలు వసూలు చేశారు. కానీ, ఆ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించకుండా మిగుల్చుకున్నారనేది ఆరోపణ. అంతేకాకుండా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకొని.. వాటి అక్రమాలు బయటకు తెలియకుండా యంత్రాంగాన్ని కట్టడి చేశారు. అలా ఒక్కో ఆసుపత్రి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు.


వంతెనను మళ్లించి.. భూముల ధర పెంచి..

ఈ నియోజకవర్గంలో రెండు జిల్లాలను కలిపే గోదావరిపై ఒక కీలక వంతెన, రహదారి విషయంలో చాలా తెలివిగా వ్యవహరించారీ ప్రజాప్రతినిధి. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మార్గాన్ని ఎసైన్డు, డీ పట్టా, జిరాయితీ భూముల మీదుగా మళ్లించారు. అంతకుముందే చాలా తక్కువ మొత్తానికి ఆ భూములను తన బినామీల పేరిట ఆయన సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి చేసి ఆ భూములను రెగ్యులర్‌ చేయించుకున్నారు. కొన్ని ప్రైవేటు భూములనూ అనుచరుల సాయంతో కొనుగోలు చేయించారు. అలా మొత్తంగా దాదాపు 150 ఎకరాలకు పైగా దక్కించుకున్నారు. వంతెన వస్తుండటంతో ఆ భూముల ధరలు పెరిగి పెద్ద ఎత్తున లబ్ధి పొందారు.


ఇల్లు కట్టాలంటే.. డబ్బు కొట్టాలి

నరసాపురంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనలన్నీ పాటించినా ఈ ప్రజాప్రతినిధి దందాకు తలొగ్గాల్సిందే. లేదంటే ఇల్లు స్లాబు దశకు వచ్చే వరకు చూసి.. సరిగ్గా స్లాబు వేసే రోజు అధికారులను పంపి అడ్డుకుంటారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఏదో ఒక కారణం చూపి కూల్చేస్తామని భయపెడతారు. ‘ఆయనను కలవండి.. ప్రసాదం సమర్పించుకోండి’ అంటూ ఉచిత సలహా ఇస్తారు. చిన్న ఇల్లయితే రూ.లక్ష, అపార్టుమెంట్‌ అయితే రూ.5 లక్షల వరకు ఇచ్చుకోవాల్సిందే. ఈ పట్టణంలో జరిగే అభివృద్ధి పనులు సైతం ఆ నేతకు చెందిన బినామీ గుత్తేదారులే చేస్తారు. పట్టణాన్ని ఆనుకొని గోదావరి తీరంలో ఉన్న ఏటిగట్టు వరదలకు జారిపోయే ప్రమాదం ఏర్పడింది. దాన్ని బలోపేతం చేసేందుకు దాదాపు రూ.26 కోట్ల అంచనా విలువతో పనులు మంజూరయ్యాయి. ఆ పనులు చేశాక.. కరకట్ట ఇంతవరకు అయిదు సార్లు జారిపోయిందంటే నాణ్యతను అంచనా వేయవచ్చు. ఉభయగోదావరి జిల్లాల మధ్య ఇక్కడ గోదావరి నదిపై పంటు ఉంటుంది. నిత్యం వందలాది మంది ఈ పంటుపై రాకపోకలు సాగిస్తుంటారు. సాధారణంగా మండల పరిషత్తు ఆధ్వర్యంలో ఈ పంటుకు వేలం పాట నిర్వహిస్తారు. పాట లేని రోజుల్లో మండల పరిషత్తు ఆధ్వర్యంలోనే నిర్వహించి ఆ సొమ్ము ప్రభుత్వానికి చెల్లిస్తారు. గత అయిదేళ్లలో దాదాపు ఏడాది పాటు పంటును వేలం లేకుండా నిర్వహించిన రోజులున్నాయి. ఆ సమయంలో రాబడిలో కొంత వాటాను ఈ ప్రజాప్రతినిధి స్వాహా చేశారని చెబుతుంటారు.


ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని