నిజం చెబితే.. గురువులకు నోటీసులు!

‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్‌ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు.

Updated : 25 Apr 2024 07:56 IST

పాఠశాల విద్యాశాఖ అధికారుల  అత్యుత్సాహం
బడుల్లో సదుపాయాలు లేవన్నందుకు బెదిరింపులు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, కొత్తచెరువు, కదిరి: ‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్‌ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు అడుగడునా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆఖరికి గురువుల చేత అబద్ధాలు చెప్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సదుపాయం లేదని, మరుగుదొడ్లు లేవని నివేదికల్లో నమోదు చేసినందుకు పలువురు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలకు విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. అలా ఎందుకు చేశారంటూ వివరణ కోరింది. దీనిపై ఉపాధ్యాయులు ఆశ్చర్యపోతున్నారు. పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం లేదని చెప్పిన పాపానికి శ్రీసత్యసాయి జిల్లాలోని 62 మంది ఎంఈఓలతో పాటు 38 మంది ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 422 మంది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ మంగళవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఏటా ప్రవేశాలు పూర్తయ్యాక.. విద్యార్థుల సంఖ్య, పాఠశాలలో సదుపాయాలు, కల్పించాల్సిన వసతుల వివరాలతో ప్రధానోపాధ్యాయులు ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ (యూడైస్‌) ప్లస్‌లో నివేదిక సమర్పించాలి. ఇంటర్నెట్‌ సౌకర్యం లేదని గతేడాది శ్రీసత్యసాయి జిల్లా ప్రధానోపాధ్యాయులు పొందుపరిచారు. దీనిపై ఇప్పటిదాకా నోరెత్తని విద్యాశాఖ.. తాజాగా తాఖీదులు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. యూడైస్‌లో క్రిటికల్‌ ఇండికేటర్స్‌ తప్పుగా నమోదు చేసినందుకు 24వ తేదీ సాయంత్రం లోపు వివరణ ఇవ్వాలంటూ మండల విద్యాధికారులు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తాఖీదులు జారీ అయ్యాయి. దీని వెనుక వైకాపాతో అంటకాగుతున్న కీలక అధికారి ఒకరు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైకాపా ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందడం లేదు. తమ హక్కుల కోసం వారు కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో వారి ఇబ్బంది పెట్టి తమవైపు తిప్పుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే నోటీసులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పాఠశాలలకు చేరని రౌటర్లు..

శ్రీసత్యసాయి జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు యూడైస్‌ నివేదిక గతేడాది అక్టోబరులోనే విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపించారు. ఆ సమయంలో పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సదుపాయం లేదని పొందుపరిచారు. ఇప్పటికీ ఇంటర్‌నెట్‌ రౌటర్లు చేరని పాఠశాలలు ఉన్నాయి. 224 రౌటర్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మూలన పడేశారు. కొన్ని పాఠశాలల్లో వాటిని అమర్చలేదు. చాలా పాఠశాలల్లో విద్యుత్తు సమస్య కూడా ఉంది. పరిస్థితులు ఇలా ఉండగా, సదుపాయాలు లేవని నివేదికలో చూపినందుకు తాఖీదులు తీసుకోవాల్సి వచ్చిందని ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ప్రభుత్వ తప్పునకు హెచ్‌ఎంలు బాధ్యులా?

పాఠశాలల్లో సదుపాయాలపై ఉన్నది ఉన్నట్లు యూడైస్‌లో తెలిపిన ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు ఎలా బాధ్యులవుతారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రధానోపాధ్యాయులు ఎలా బాధ్యులవుతారని ఏపీటీఎప్‌ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు కోడూరు శ్రీనివాసులు, గౌరవాధ్యక్షుడు పీవీ మాధవ, జిల్లా కార్యదర్శి ఆర్‌.చంద్ర జిల్లా విద్యాధికారి మీనాక్షికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఎస్‌ఏలో ఖాళీగా ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఏఎస్‌ఓ, ఏపీఓ, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ పోస్టులను భర్తీ చేయలేదని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులకు, ఎంఈఓలకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను వెంటనే రద్దు చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు