నాడు ఫిఫోతోనే చెల్లింపులు.. ఇప్పుడెందుకు లేవు?

రాష్ట్రంలో ప్రస్తుతం బిల్లుల చెల్లింపుపై వివాదం రేగుతోంది. పోలింగ్‌ ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడేలోపు వైకాపా అనుయాయులు, గుత్తేదారులు ఆర్థికశాఖ నుంచి తమ బిల్లులను సాధించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Updated : 15 May 2024 06:45 IST

పోలింగ్‌ అనంతరం బిల్లుల చెల్లింపుపై వివాదం
అనుయాయులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు
తొలుత వచ్చిన బిల్లు తొలుతే చెల్లించాలంటూ డిమాండ్లు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం బిల్లుల చెల్లింపుపై వివాదం రేగుతోంది. పోలింగ్‌ ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడేలోపు వైకాపా అనుయాయులు, గుత్తేదారులు ఆర్థికశాఖ నుంచి తమ బిల్లులను సాధించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఎస్‌ఎస్‌ రావత్‌, సత్యనారాయణ మార్గదర్శకాలు పాటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఇప్పటికి ఉన్న జీవోల ప్రకారమే సీఎస్‌ వ్యవహరించాలి. గత ఎన్నికల తర్వాత బిల్లులు ఎలా చెల్లించారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలుసుకునేందుకు నాటి సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ‘ఈనాడు’ సంప్రదించింది. ఆయన ఏమన్నారంటే...

ఫిఫో అనుసరించాం: ఎల్వీ సుబ్రహ్మణ్యం

2019లో పోలింగు ముగిశాక బిల్లుల చెల్లింపుపై రకరకాల డిమాండ్లు వినిపించాయి. అప్పటికే పెండింగు బిల్లులు ఉన్నందున అందరూ వాటికోసం ఎదురుచూస్తున్నారు. బిల్లుల చెల్లింపులో ఉత్తమ విధానం ఫిఫో పాటించడమే. మొదట వచ్చిన బిల్లు మొదట చెల్లించడమే ఫిఫో విధానం. ఆ క్రమంలోనే బిల్లులు చెల్లించేలా విధివిధానాలు అనుసరించాం.

ఫిఫోను ఎప్పుడో మరిచిపోయిన ఆర్థికశాఖ

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అస్తవ్యస్త ఆర్థిక విధానాలు వచ్చాయి. అంతవరకు సీఎఫ్‌ఎంఎస్‌ (సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం) ఉండేది. ఫిఫో అమలుచేసేవారు. ఒకవేళ మధ్యలో ఉన్న బిల్లు అత్యవసరంగా చెల్లించాల్సి వచ్చినా, ఆ ముందున్న బిల్లులు చెల్లించాకే ఆ బిల్లుకు మోక్షం లభించేది. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాన్ని ఎత్తేశారు. సీఎంఓ నుంచి ఒక ఉన్నతస్థాయి వ్యక్తి ఈ అంశాన్ని పర్యవేక్షించసాగారు. అక్కడి నుంచి వచ్చిన నంబరు బిల్లుకే చెల్లించడంతో గుత్తేదారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అయినా ఈ ప్రభుత్వంలో చలనం రాలేదు. గడిచిన ఐదేళ్లలో దాదాపు రూ.1.70 లక్షల కోట్ల బిల్లులు పెండింగులో ఉండిపోయాయి. దాంతో చాలామంది గుత్తేదారులు పనులు చేయడం మానేశారు. టెండర్లు వేయడానికీ వెనకడుగు వేశారు. ఆఖరికి బిల్డర్స్‌ అసోసియేషన్‌ నుంచి గుత్తేదారులు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శికి కూడా లేఖ రాసి రాష్ట్రంలో ఫిఫో విధానం పాటించట్లేదని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు సమీకరిస్తోంది. ఈ మొత్తాలను సరైన దిశగా ఖర్చుచేయకపోతే ఆ మేరకు ప్రభావం పడుతుంది. వైకాపా అనుయాయ గుత్తేదారుల చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో బిల్లుల చెల్లింపులో ఫిఫో విధానమే ఉత్తమం అనే డిమాండ్‌ వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని