ఆంధ్రప్రదేశ్‌లో 44 రోజులు... రూ.17 వేల కోట్ల అప్పులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే విపరీతమైన అప్పులు పుట్టిస్తున్నారు.

Updated : 15 May 2024 08:34 IST

తాజాగా రూ.4,000 కోట్ల అప్పు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే విపరీతమైన అప్పులు పుట్టిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో సాధారణ ఖర్చులకు తప్ప ఇతరత్రా ఏ అవసరాలూ ఉండవు. అలాంటిది కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్‌ 1 తర్వాత ఇంతవరకు 44 రోజుల్లో రూ.17 వేల కోట్ల మేర బహిరంగ మార్కెట్‌ రుణాలను రాష్ట్రప్రభుత్వం తీసుకుంది. ఇవికాకుండా వేస్‌ అండ్‌ మీన్స్‌ వెసులుబాటు కింద రిజర్వ్‌బ్యాంక్‌ కల్పించే అవకాశాలు ఉపయోగించి రూ.వేల కోట్ల అప్పు తెచ్చి అవసరాలు తీరుస్తోంది. ఆ మొత్తాలు ఎప్పటికప్పుడు తిరిగి ఆర్‌బీఐకి సర్దుబాటు చేయాల్సి ఉన్నా వడ్డీ కట్టాలి. ఇవికాక కార్పొరేషన్ల ద్వారా పెద్ద మొత్తంలో రుణం సేకరించి అధికార వైకాపాకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు అనేక రూపాల్లో జరిగాయి. తాజాగా అధికారపార్టీ గుత్తేదారుల పందేరం కోసమూ రుణ సమీకరణ సాగుతోంది. మే 14న రిజర్వుబ్యాంకు నిర్వహించిన వేలంలో రూ.4,000 కోట్ల రుణం సమీకరించారు. దీంతో ఇంతవరకు 44 రోజుల్లో రూ.17వేల కోట్లు ఇలా తీసుకున్నట్లయింది. తొమ్మిదేళ్లలో తీర్చేలా రూ.500 కోట్లు 7.45% వడ్డీకి, 16 ఏళ్లలో తీర్చేలా 7.45% వడ్డీకి మరో రూ.500 కోట్లు తీసుకున్నారు. ఇవి కాకుండా రూ వెయ్యి కోట్ల చొప్పున 21, 23, 23 ఏళ్లలో చెల్లించేలా 7.42, 7.41% వడ్డీకి మరో రూ.3,000 కోట్ల అప్పు తీసుకున్నారు.

ఆరు నెలలకు రూ.47 వేల కోట్ల అనుమతులు

కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలకు రూ.47వేల కోట్ల రుణ అనుమతులు ఇచ్చింది. ఆ అప్పులు సింహభాగం ఇప్పుడే తీసుకోవడానికి వైకాపా ప్రభుత్వ హయాంలో అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.68,500 కోట్ల అప్పు తీసుకున్న ప్రభుత్వం.. ఈ ఏడాది దాన్ని రూ.లక్ష కోట్లకు చేర్చేందుకు సిద్ధమయింది. ఇదంతా బహిరంగ మార్కెట్‌ రుణమే. ఏప్రిల్‌ 2న రూ.4,000 కోట్లు, ఏప్రిల్‌ 23న రూ.3,000 కోట్లు, ఏప్రిల్‌ 30న రూ.3,000 కోట్లు మే 7న రూ.3,000 కోట్ల రుణాన్ని ప్రభుత్వం సమీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని