Andhra Pradesh Assembly Elections: తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్‌కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని  దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో  ముట్టడించి వీరంగం సృష్టించారు.

Updated : 16 May 2024 23:43 IST

తెల్లవారుజామున  జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై ప్రత్యేక బలగాలతో దాడి
సీసీ కెమెరాలు పగలగొట్టి..  తెదేపా కార్యకర్తలు, సిబ్బందిపై దాష్టీకం
ఎస్సీ వర్గానికి చెందిన దివ్యాంగుడు కిరణ్‌ తలపై బలంగా కొట్టిన డీఎస్పీ
కిరణ్‌ పరిస్థితి విషమం..
జేసీ ఇంటి చుట్టుపక్కల ఉంటున్న తెదేపా వర్గీయుల గృహాలపైనా దాడులు
పలువురికి గాయాలు

తాడిపత్రి, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్‌కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని  దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో  ముట్టడించి వీరంగం సృష్టించారు. జేసీ ఇంటితో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్లల్లో నిద్రిస్తున్న తెదేపా సానుభూతిపరుల ఇళ్లపై సైతం విరుచుకుపడ్డారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో హఠాత్తుగా దాడి చేసి చితకబాదారు. వారు పనివాళ్లా, సిబ్బందా, తెదేపా వర్గీయులా అన్న తేడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. వారిని బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి తరలించారు. 

ఈ క్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసానికి సమీపంలోనే ఉంటున్న కిరణ్‌ అనే ఎస్సీ వర్గానికి చెందిన దివ్యాంగుడి తలపై డీఎస్పీ చైతన్య లాఠీతో బలంగా కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కిరణ్‌ పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. వీఎన్‌కే చైతన్య ప్రస్తుతం కడప జిల్లా రాజంపేటలో పని చేస్తున్నారు. గతంలో తాడిపత్రి డీఎస్పీగా పని చేసినప్పుడు వైకాపాకు కొమ్ముకాస్తూ.. తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్‌లు చేసి తీవ్రస్థాయిలో అణచివేతకు పాల్పడ్డారు. తాడిపత్రిలో రెండు రోజులుగా వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గాల మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో.. బందోబస్తు మిషతో చైతన్యను మంగళవారం రాత్రి ఇక్కడికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటలకు ప్రత్యేక బలగాలతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై విరుచుకుపడ్డారు. అక్కడికి వస్తూనే.. వారి దమనకాండకు సాక్ష్యాల్లేకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. కొన్నింటిపై వస్త్రాలు కప్పేశారు. అనంతరం జేసీ నివాసంలో హాల్లో పడుకున్న కార్యకర్తలు, పరిసరాల్లో ఉన్న ఇళ్లల్లో నిద్రపోతున్న తెదేపా వర్గీయులు, జేసీ వద్ద డ్రైవర్లుగా పని చేస్తున్న వారిని బయటకు లాక్కుని వచ్చి చితకబాదారు. ఈ ఘటనలో దివ్యాంగుడైన కంప్యూటర్‌ ఆపరేటర్‌ కిరణ్‌, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కిరణ్‌ పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు.

దివ్యాంగుడినని చెప్పినా వినిపించుకోలేదు

‘‘తాడిపత్రిలో రెండు రోజులుగా పెద్దారెడ్డి వర్గీయులు దాడులు చేస్తున్నారు. వాటితో నాకు సంబంధం లేదు. రాత్రి రెండు గంటల సమయంలో ఇంటిలో నిద్రిస్తున్న నా దగ్గరకు స్పెషల్‌ పార్టీ పోలీసులు వచ్చి డీఎస్పీ చైతన్య పిలుస్తున్నారని చెప్పారు. వాహనంలో ఎక్కగానే డీఎస్పీ చైతన్య నా తలపై గట్టిగా లాఠీతో కొట్టారు. నన్ను ఎందుకు కొడుతున్నారు..? నేను దివ్యాంగుడినని మొర పెట్టుకున్నా వినకుండా చావబాదారు. తలకు గాయమై రక్తస్రావం అవుతున్నా బలవంతంగా అక్కడే ఉంచారు. సీఐ చూసి రక్తం ఎక్కువగా పోతోందని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆసుపత్రికి తీసుకొచ్చారు. డీఎస్పీ చైతన్య గతంలో తాడిపత్రిలో పని చేస్తున్న సమయంలో మాపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసేవారు. ఇప్పుడు మళ్లీ అదే రీతిలో దాడి చేశారు.’’

 కిరణ్‌, జేసీ కార్యాలయ కంప్యూటర్‌ ఆపరేటర్‌

జేసీ ప్రభాకర్‌రెడ్డికి అస్వస్థత

తాడిపత్రిలో మంగళవారం తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనను అదుపు చేసేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తమ ఇంట్లో పనిచేసే వారిని కూడా అరెస్టు చేసి తీసుకెళ్లడం అన్యాయమని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి డీఎస్పీ గంగయ్యతో మాట్లాడారు.

తెదేపా, వైకాపా నాయకులు, కార్యకర్తలపై కేసులు

తాడిపత్రిలో రెండు రోజుల నుంచి జరుగుతున్న రాళ్ల దాడులు, ఏజెంట్లపై దాడి సంఘటనల్లో తెదేపా, వైకాపా నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశామని పట్టణ సీఐ మురళీకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని