మన చరిత్రేంటో లోకమంతా చూసింది

ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Updated : 17 May 2024 07:25 IST

ఆధారాల పరిశీలనతో పనేముంటుంది?
పల్నాడులో ఎన్నికల హింసపై హైకోర్టు ఆవేదన
మరోసారి జరగకుండా చర్యలు తీసుకోండి
సీఈఓ, డీజీపీ, కలెక్టర్‌, ఎస్పీలకు ఆదేశం

ఈనాడు, అమరావతి: ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. పల్నాడులోని ఘటనలను అందరూ చూశారనేది జగమెరిగిన సత్యమని, అందుకు ఆధారాలను పరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొంది. హింసాత్మక ఘటనలపై ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో.. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ), డీజీపీలతో పాటు పల్నాడు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. అదనపు బలగాలను మోహరించాలంటూ పిటిషనర్‌ సమర్పించిన వినతిపైనా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి గురువారం ఉత్తర్వులిచ్చారు.

పల్నాడు జిల్లావ్యాప్తంగా ఎన్నికల రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని, వాటిని నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారని పేర్కొంటూ వినుకొండకు చెందిన నలబోతు రామకోటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అదనపు బలగాలను మోహరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. అదనపు బలగాలను మోహరించాలని కోరుతూ సీఈఓ, డీజీపీ, తదితరులకు వినతి ఇచ్చినా చర్యలు లేవని తెలిపారు. హింసా ఘటనలకు చెందిన ఆడియోను వినాలని న్యాయమూర్తిని కోరారు. అవసరం లేదని తెలిపిన న్యాయమూర్తి.. పల్నాడులోని ఘటనలను ఏపీ ప్రజలకే కాదు.. ప్రపంచానికే చూపామని వ్యాఖ్యానించారు.

  • ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అదనపు బలగాలను మోహరించాలంటూ పిటిషనర్‌ ఇచ్చిన వినతి పరిశీలనలో ఉందన్నారు. భద్రత చర్యల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర హోంశాఖ అని తెలిపారు.  
  • రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తరఫున ఏజీపీ నిర్మల్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. హింసాత్మక ఘటనలపై ఈసీ ఇప్పటికే వివరణ కోరిందని, పల్నాడులో పరిస్థితులు అదుపులో ఉన్నాయని, 144 సెక్షన్‌ విధించామని తెలిపారు. అదనపు బలగాలనూ మోహరించామని వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ ఇప్పటికే చర్యలు తీసుకోవడం ప్రారంభించాయని గుర్తుచేశారు.

పోలీసు భద్రతకు పులివర్తి నాని, కుటుంబ సభ్యుల వ్యాజ్యం

ఈనాడు, అమరావతి: చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి వ్యక్తిగత భద్రత కల్పించామని, ఆయన ఇంటి వద్ద పికెట్‌ ఏర్పాటు చేశామని పోలీసుల తరఫున ఏజీపీ నిర్మల్‌కుమార్‌ గురువారం హైకోర్టుకు నివేదించారు. నానిపై దాడిచేసిన వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించిందని తెలిపారు. నాని భార్య, కుమారుడికి భద్రత కల్పించే విషయంలో వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు. తనపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో పోలీసు భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ నాని, ఆయన భార్య, కుమారుడు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై న్యాయమూర్తి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని