రోడ్డుపైనే సీపీఆర్‌.. వందనమమ్మా డాక్టర్‌ రవళి

చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు.

Updated : 17 May 2024 11:24 IST

ఆరేళ్ల బాలుడి ఆయువు నిలిపిన వైద్యురాలి అప్రమత్తత

ఈనాడు,  అమరావతి: చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనైంది.. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని.. బిడ్డను భుజాన వేసుకొని ఆసుపత్రికి పరుగులు తీశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకొని... చిన్నారికి ఊపిరి పోసేందుకు ప్రయత్నించారు. రోడ్డు మీదే చిన్నారికి సీపీఆర్‌ అందించారు. వృత్తి ధర్మం పరిఢవిల్లి... వైద్యురాలి కృషి ఫలించడంతో ఆ బాలుడు మళ్లీ ఊపిరితీసుకున్నాడు. విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి(6) ఈ నెల 5వ తేదీ సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో.. తల్లిదండ్రులు ఏడుస్తూ పిల్లాడిని భుజంపై పెట్టుకుని ఆసుపత్రికి వెళ్లేందుకు పరుగులు పెడుతున్నారు. అదే సమయంలో మెడ్‌సీ ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన నన్నపనేని రవళి అటుగా వస్తూ.. వారిని చూశారు. ఏమైందని ఆమె అడగటంతో తల్లిదండ్రులు విషయం చెప్పారు.

వైద్యురాలు బాలుడిని పరీక్షించి.. అక్కడే రోడ్డుపైనే పడుకోబెట్టమని చెప్పారు. అనంతరం కార్డియో పల్మోనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) చేయడం ఆరంభించారు. ఒకవైపు డాక్టర్‌ రవళి బాలుడి ఛాతీపై చేతితో ఒత్తుతూ.. అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించారు. ఇలా.. ఏడు నిమిషాలకు పైగా చేశాక.. బాలుడిలో కదలిక వచ్చింది. వెంటనే బాలుడిని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా.. తలను కొద్దిగా కిందకి ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత.. చికిత్స ఆరంభించగా పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచి తలకు సీటీ స్కాన్‌ చేస్తే.. ఎలాంటి సమస్య లేదని గుర్తించి, డిశ్చార్జి చేసి ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్‌ రవళి రోడ్డుపైనే బాలుడిని పడుకోబెట్టి సీపీఆర్‌ చేసే సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని