శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఐకానిక్‌ తీగల వంతెన

రాష్ట్రంలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్‌-నాగర్‌కర్నూల్‌-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది.

Published : 18 May 2024 03:37 IST

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్మాణం
దోర్నాల-శ్రీశైలం మార్గంలో మలుపులు తగ్గించేలా కసరత్తు
డీపీఆర్‌ సిద్ధం చేయిస్తున్న కేంద్రం

శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ప్రస్తుతం ఉన్న వంతెన

ఈనాడు: అమరావతి : రాష్ట్రంలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్‌-నాగర్‌కర్నూల్‌-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. అది కూడా ఏపీ-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నదిపైనే నిర్మించనుంది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వేకి సమాంతరంగా ప్రస్తుతం ఉన్న పాత వంతెన స్థానంలో, దానికి సమీపంలో కొత్తగా తీగల వంతెన నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధమవుతోంది. గుంటూరు-కర్నూలు రోడ్డులో ఉన్న కుంట జంక్షన్‌ నుంచి దోర్నాల, శ్రీశైలం క్రాస్‌రోడ్, సున్నిపెంట, దోమలపెంట మీదగా హైదరాబాద్‌ వెళ్లే జాతీయ రహదారి-765ని విస్తరిస్తోంది. నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో ఈ రహదారి అనేక చోట్ల 5.5 మీటర్ల నుంచి 7 మీటర్ల మేరకే ఉంది. దీనిని 10 మీటర్లకు పెంచుతోంది. ఇప్పటికే కుంట-దోర్నాల మధ్య 24.2 కి.మీ. మేర రూ.245 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. దోర్నాల నుంచి శ్రీశైలం క్రాస్‌రోడ్‌ (శ్రీశైలం ముఖద్వారం), సున్నిపెంట మీదగా కృష్ణానదిపై వంతెన దాటే వరకు 53.5 కి.మీ. మేర విస్తరించేలా డీపీఆర్‌ను కేంద్రం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న వంతెన 1972లో నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చింది. దీనికి సమీపంలో ఐకానిక్‌ తీగల వంతెన నిర్మించనుంది. ఈ వంతెనకే రూ.వెయ్యి కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మలుపుల్లేకుండా నేరుగా వంతెనపైకి..

దోర్నాల-శ్రీశైలం ప్యాకేజీలో అనేక మలుపులు ఉన్నాయి. వీటిని సాధ్యమైనంత తగ్గించేలా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్‌) చూస్తోంది. శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే మార్గంలో సున్నిపెంట దాటాక ఉండే ఘాట్‌లో అనేక మలుపులు తిరిగి కృష్ణా నదిపై వంతెన వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. వీటిని తగ్గించేందుకు సున్నిపెంట వద్ద బైపాస్‌ నిర్మించి, నేరుగా కొత్తగా నిర్మించే తీగల వంతెనపైకి చేరుకునేలా చూడనుంది. దోర్నాల-శ్రీశైలం మధ్యలో పలు చోట్ల ప్రస్తుతమున్న మలుపులను తగ్గించేలా అలైన్‌మెంట్‌లో మార్పులు చేయనుంది.

వన్యప్రాణి విభాగం  అభ్యంతరాలు

ఈ ప్యాకేజీలో అలైన్‌మెంట్‌ మార్పులతో అనేక చోట్ల రక్షిత అటవీ ప్రాంతంలోకి రహదారి వెళ్తుంది. దీనివల్ల వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని అటవీశాఖలోని వన్యప్రాణి సంరక్షణ విభాగం అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది. ఎక్కువ అటవీ భూమి తీసుకోకుండా, ప్రస్తుతమున్న రహదారినే విస్తరించేలా చూడాలని సూచిస్తోంది. కేంద్రం మాత్రం.. ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం, శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని అలైన్‌మెంట్‌ను మార్చాలనుకుంటోందని అధికారులు చెబుతున్నారు. టీపీఎఫ్‌ కన్సల్టెంట్స్‌ అనే సంస్థ ద్వారా ఈ ప్యాకేజీకి సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేయిస్తోంది. ఇది తయారైతే వచ్చే ఏడాదిలోపు పనులు మంజూరయ్యే వీలుందని తెలిసింది. ఈ ప్యాకేజీని తెలంగాణ మోర్త్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని