నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!

ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు.

Updated : 18 May 2024 06:32 IST

స్పందించని ఫీడర్‌ అంబులెన్స్‌ సిబ్బంది

లచ్చపేట నుంచి గర్భిణిని డోలీలో మోసుకొస్తున్న గిరిజనులు

కుక్కునూరు, న్యూస్‌టుడే: ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. కేవలం కాలిబాటే దిక్కైన ఆ పల్లెకు ఫీడర్‌ అంబులెన్స్‌ వచ్చే అవకాశమున్నా.. సిబ్బంది అందుబాటులోకి రాలేదు. దాంతో గర్భిణి వేదనను చూడలేని కుటుంబ సభ్యులు సుమారు ఆరు కిలోమీటర్ల మేర డోలీలో మోసుకెళ్లారు. అక్కడి నుంచి వాహనంలో పీహెచ్‌సీకి తరలించారు. ఈ ఘటన ఏలూరు జిల్లా లచ్చపేట ఆదివాసీ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దూది కోసి(24)కి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఏఎన్‌ఎంకు సమాచారం అందించారు. ఆమె గ్రామానికెళ్లి గర్భిణిని పరిశీలించారు. సుఖ ప్రసవమయ్యే మార్గం కనిపించకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఫీడర్‌ అంబులెన్స్‌ సిబ్బందికి ఫోన్‌ చేశారు. అటు వైపు నుంచి స్పందన లేకపోవడంతో కోసి భర్త శిరమయ్య.. మంచాన్ని డోలీలా తయారు చేసి, అందులోనే ఆరు కిలోమీటర్ల మేర మోసుకొని గుండంబోరు గ్రామానికి చేరుకున్నారు. అక్కడినుంచి వాహనంలో కుక్కునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రసవం చేయగా... తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారని పీహెచ్‌సీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని