2 లక్షల మందికి బీసీజీ టీకా పూర్తి

రాష్ట్రంలో క్షయ(టీబీ) వ్యాధి వ్యాప్తి, కేసుల నియంత్రణకు బీసీజీ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా.. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నంద్యాల, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, కడప జిల్లాల్లో గడిచిన 2 రోజుల్లో 2 లక్షల మందికి ఈ వ్యాక్సిన్‌ వేశారు.

Updated : 18 May 2024 05:25 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో క్షయ(టీబీ) వ్యాధి వ్యాప్తి, కేసుల నియంత్రణకు బీసీజీ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా.. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నంద్యాల, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, కడప జిల్లాల్లో గడిచిన 2 రోజుల్లో 2 లక్షల మందికి ఈ వ్యాక్సిన్‌ వేశారు. ఈ టీకా పంపిణీ 12 వారాల వరకు జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 88,537 టీబీ కేసులు ఉన్నాయి. లక్షకు 164 చొప్పున నమోదైనట్లు అధికారులు గుర్తించారు. 2023 నివేదిక ప్రకారం.. క్షయ వ్యాధి కేసుల్లో ఏపీ జాతీయ స్థాయిలోనే 19వ స్థానంలో ఉంది. ఈ కేసులు గుర్తించిన ఇళ్లల్లోని కుటుంబ సభ్యుల్లో 18 ఏళ్లు దాటినవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, పొగ తాగేవారు, 60 ఏళ్లు పైబడినవారు సమ్మతి తెలిపిన వారికి మాత్రమే ఈ టీకా ఇస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో 36 శాతం వరకు ఈ వ్యాధి రాకుండా రక్షణ లభిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు క్షయ వ్యాధి వచ్చే ప్రమాదం ఇతరుల కంటే 3 రెట్లు ఎక్కువ. క్షయ వ్యాధి కేసుల్లో సుమారు 15 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 


25న డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ నియామక పరీక్ష

ఈనాడు డిజిటల్, అమరావతి: డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌(డీఈవో) ఉద్యోగ నియామక రాత పరీక్షను ఈ నెల 25న నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.


అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 29 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సభ్య కార్యదర్శి శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27లోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://dme.ap.nic.in వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు. 


బాలల రక్షణకు భద్రతా చర్యలు చేపట్టండి

డీజీపీకి బాలల హక్కుల కమిషన్‌ ఆదేశాలు

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాత్మక ఘటనల్లో బాలలు, మహిళలు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని బాలల హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వారి భద్రత కోసం చర్యలు చేపట్టాలని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాను ఆదేశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని