రాబడుల్లో ఇలా మిగిలాం!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.

Updated : 18 May 2024 04:28 IST

నాడు తెలంగాణ కన్నా ముందున్న రాష్ట్రం
ఇప్పుడు అంతా తగ్గుదలే

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రాబడులు తగ్గుతూ వస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం లెక్కలను కాగ్‌ ఖరారు చేసింది. జగన్‌ పాలనలో చివరి ఆర్థిక సంవత్సరంలోనూ పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తెదేపా ప్రభుత్వంలో చివరి రెండేళ్లలో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ సొంత రెవెన్యూ రాబడులు ఏకంగా 18.28%, 13.07% అధికంగా ఉన్నాయి. అలాంటిది జగన్‌ పాలనలో చివరి ఏడాదికి వచ్చేసరికి సొంత రెవెన్యూ రాబడులు తెలంగాణతో పోలిస్తే 2.88% మాత్రమే అధికంగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది తెలంగాణ కన్నా దిగజారిపోయాయి. సొంత రెవెన్యూ రాబడులను పెంచుకోవడంలో ఏపీ వెనుకబడింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తొలి అయిదేళ్లు... ఆ తర్వాత జగన్‌ పాలనలో ఐదేళ్లు తెలంగాణతో పోల్చిచూస్తే ఇక్కడి ప్రగతి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇట్టే అవగతమవుతుంది. వైకాపా ప్రభుత్వం స్థూల ఉత్పత్తి పెరుగుతోందని చెబుతున్నా.. అందుకు తగ్గట్టుగా రెవెన్యూ రాబడులు లేకపోవడం విశేషం.

రిజిస్ట్రేషన్ల ఆదాయం అక్కడే ఎక్కువ

రాష్ట్ర విభజన తర్వాత తొలి ఐదేళ్లూ ఏపీలోనే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువ ఉండేది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 3.79% స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా ఉండేది. అలాంటిది జగన్‌ పాలనలో మొత్తం స్వరూపమే మారిపోయింది. ఈ ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌ కునారిల్లితే తెలంగాణ ఎంతో ముందుకు వెళ్లిపోయింది. 2019 నుంచి 2024 మధ్య తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.52,810 కోట్లు. అదే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన మొత్తం రూ.32,161.61 కోట్లే. తెలంగాణతో పోలిస్తే ఏపీలో 31% కన్నా తక్కువ ఈ రంగం నుంచి ఆదాయం లభించింది. అమ్మకపు పన్నుల రాబడి కూడా తెలంగాణతో పోలిస్తే ఏపీలో మరీ తక్కువ. తెలంగాణలో ఈ రూపేణా రూ.29,989.55 కోట్ల ఆదాయం వస్తే ఏపీలో అది రూ.18,475.15 కోట్లకే పరిమితమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు