ఇసుక లారీలకు టార్పాలిన్‌ తప్పనిసరి చేయండి

ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది.

Published : 18 May 2024 04:09 IST

కాలుష్య నివారణకు చర్యలు తీసుకోండి
గనుల శాఖకు హైకోర్టు ఆదేశం
అమికస్‌ క్యూరీ సూచనల మేరకు నోటీసులు జారీచేసిన ధర్మాసనం
విచారణ జులై 31కి వాయిదా

ఈనాడు, అమరావతి: ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. విచారణలో కోర్టుకు సహాయకులుగా (అమికస్‌క్యూరీ) వ్యవహరిస్తున్న సీనియర్‌ న్యాయవాదులు నోర్మా అల్వారెస్, కేఎస్‌ మూర్తి చేసిన పలు సూచనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఇసుక రవాణా చేస్తున్న అన్ని ట్రక్కులపై టార్పాలిన్లు కప్పడం తప్పనిసరి చేసేలా జీసీకేసీ ప్రాజెక్ట్స్, ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలను (రాష్ట్రంలో ప్రస్తుతం మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు)ఆదేశిస్తూ ఉత్తర్వులివ్వాలని గనులు, భూగర్భశాఖ అధికారులను ఆదేశించింది. టార్పాలిన్‌ కప్పకుండా రవాణా చేస్తే ఎంత జరిమానా విధించాలనే విషయంపై తదుపరి విచారణలో తేలుస్తామని పేర్కొంది. ఈ విషయమై సలహాలు ఇచ్చే అంశాన్ని ఏజీ, అమికస్‌క్యూరీలకు విడిచిపెట్టింది. ట్రక్కులు ఏ సమయంలో తిరిగేందుకు అనుమతించాలనేదానిపై అమికస్‌క్యూరీ, ఇసుక రవాణాలో భాగస్వాములైన వారితో సంప్రదించాల్సిన అవసరం ఉందని ఏజీ చెబుతున్న నేపథ్యంలో తదుపరి విచారణలో ఈ అంశాన్ని చర్చిస్తామని తెలిపింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా జీసీకేసీ ప్రాజెక్ట్స్, ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జులై 31కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.

  •  పల్నాడు జిల్లా అమరావతి మండలం ముత్తాయపాలెం గ్రామ సమీపంలోని కృష్ణానదిలో జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థ ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతోందని, నదికి అడ్డంగా ర్యాంపులు ఏర్పాటు చేసి ఇసుకను భారీ వాహనాలతో తరలిస్తున్నారని పేర్కొంటూ జీవీఎస్‌ఎస్‌ వరప్రసాద్, మరో ఐదుగురు 2023 ఏప్రిల్‌లో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంతో పాటు మరికొన్నింటిని కలిపి హైకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. 
  • గోవాలో ఇసుక అక్రమ రవాణా, శబ్ద, వాయు కాలుష్య నిర్మూలనకు తీవ్రంగా కృషి చేసిన సీనియర్‌ న్యాయవాది, పర్యావరణవేత్త నోర్మా అల్వారెస్‌ను ధర్మాసనం అమికస్‌క్యూరీగా నియమించింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి కూడా అమికస్‌క్యూరీగా వ్యవహరిస్తున్నారు. 
  • ఇటీవల ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరిపింది. ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) విచారణ జరిపి ఇప్పటికే పలు ఉత్తర్వులు జారీచేసిందని  గుర్తుచేసింది. జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థకు రూ.18 కోట్ల జరిమానా విధించిందని తెలిపింది. ఇసుక రవాణా విషయంలో లారీలకు టార్పాలిన్‌ కప్పడం ద్వారా వాయు కాలుష్యాన్ని నివారించవచ్చని అమికస్‌క్యూరీలు సూచించారని తెలిపింది. 
  • మరోవైపు ఇసుక లారీలు గ్రామాల ద్వారా ప్రయాణించడం వల్ల పాదచారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ఇసుక లారీలను అనుమతించొద్దని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి 2 నుంచి 6 గంటల మధ్య మాత్రమే ఇసుకను రవాణా చేసేందుకు సమయాన్ని ఖరారు చేయాలని గనులశాఖకు అమికస్‌క్యూరీలు సూచించారని ధర్మాసనం తెలిపింది. మరోవైపు ఇసుక రవాణా సమయంలో గ్రామాల్లో కాలుష్య స్థాయిలను పర్యవేక్షించేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, తీవ్రత ఎక్కువగా ఉంటే ట్రక్కుల సంఖ్యను తగ్గించాలని, అవసరమైతే లారీలు ప్రయాణించాల్సిన మార్గాలను మార్చాలని అమికస్‌క్యూరీలు సూచించారని తెలిపింది. ఈ నేపథ్యంలో గనులశాఖ వివిధ రహదారి మార్గాలను గుర్తించడం ద్వారా గ్రామస్థుల అసౌకర్యాలను తగ్గించవచ్చని ధర్మాసనం పేర్కొంది. 
  • కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు ఏజీ సైతం సానుకూలంగా ఉన్నారని ధర్మాసనం తెలిపింది. ఈ వ్యవహారాన్ని పునఃపరిశీలిస్తామని ఏజీ వెల్లడించారని పేర్కొంటూ  విచారణను వాయిదా వేసింది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని