గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!

ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్‌ చేస్తున్నారు.

Published : 18 May 2024 04:11 IST

 రాజమహేంద్రవరంలో యథేచ్ఛగా డ్రెడ్జింగ్‌

ధవళేశ్వరంలోని గాయత్రీ రేవులో డ్రెడ్జింగ్‌

ఈనాడు, రాజమహేంద్రవరం: ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్‌ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం పరిధిలో బోట్స్‌మన్‌ సొసైటీల పేరుతో అనుమతులు పొందిన రీచ్‌లలో యంత్రాలే అధికంగా ఉన్నాయి. పదుల సంఖ్యలో డ్రెడ్జర్లు నదిలోంచి ఇసుక తెస్తుంటే.. యంత్రాలతో పడవల్లోని ఇసుకను లారీల్లోకి లోడ్‌ చేసి పంపిస్తున్నారు. రాజమహేంద్రవరం గ్రామీణం, కొవ్వూరు పరిధిలో   70 వరకు డ్రెడ్జర్లు తిరుగుతున్నాయి. కలెక్టరేట్, జలవనరుల శాఖ కార్యాలయానికి సమీపంలోనే వైకాపా నాయకుల కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతోంది. సెబ్, జలవనరులు, రెవెన్యూ, పోలీసు, భూగర్భ గనుల శాఖ, విజిలెన్స్‌ విభాగాలు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. శుక్రవారం నుంచి ఓపెన్‌ రీచ్‌లలో తవ్వకాలు నిలిచిపోవడంతో నదిలో భారీ ఎత్తున డ్రెడ్జింగ్‌ చేస్తున్నారు. వాస్తవానికి బోట్స్‌మన్‌ సొసైటీల పేరుతో అనుమతులు పొందిన రేవుల్లో ఆయా సభ్యులు పడవల్లో నదిలోకి వెళ్లి చేతులతో ఇసుక తవ్వి  తీసుకురావాలి. ఇక్కడ అది కనిపించడం లేదు. 30 రీచ్‌లకు అనుమతులుండగా, వాటిలో 70 డ్రెడ్జర్లు తిరుగుతున్నాయని అంచనా. వీటి ద్వారా రోజుకు సగటున 35 వేల టన్నుల ఇసుక తరలుతోంది. తద్వారా రూ.2 కోట్ల వరకు చేతులు మారుతోంది. గోదావరిలో డ్రెడ్జింగ్‌పై జలవనరులశాఖ ఎస్‌ఈ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. తన దృష్టికి రాలేదని, శనివారం అధికారులను తనిఖీలకు పంపిస్తామని సమాధానమిచ్చారు. 

డ్రెడ్జింగ్‌ పడవల్లో ఇసుక తరలించి గుట్టగా వేస్తూ..

హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లి..

గోదావరిలో వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ డ్రెడ్జింగ్‌ జరుగుతున్న తీరుపై ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, వంశీ దినేశ్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎస్పీ, ఇతర అధికారులకు న్యాయస్థానం సూచించింది. అయితే.. అధికారులంతా తప్పుడు నివేదికలు ఇచ్చి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ముప్పాళ్ల ఆరోపించారు. దీనిపై తాము తగిన ఆధారాలతో పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రెడ్జింగ్‌పైనా పిల్‌ ఉందన్నారు. అక్రమ తవ్వకాలను కట్టడి చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని, సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని