కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు అస్వస్థత.. కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స

విశాఖలోని కింగ్‌ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్‌) సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Published : 18 May 2024 04:29 IST

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖలోని కింగ్‌ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్‌) సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అశోక్‌కుమార్‌ ఈనెల 15న కేజీహెచ్‌లో విధులు నిర్వర్తిస్తూ.. గుండెలో నొప్పిగా ఉందని తొలుత అదే ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో చేరారు. ఆ విభాగ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైద్య బృందం ప్రాథమిక పరీక్షలు చేసి, హార్ట్‌బీట్‌ తగ్గుతున్నట్లు నిర్ధారించారు. వెంటనే తాత్కాలిక పేస్‌మేకర్‌ను అమర్చారు. సమస్య తగ్గకపోవడంతో అదే రోజు సాయంత్రం మెరుగైన వైద్యం కోసం నగరంలోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరారు. అక్కడి వైద్యులు పరిశీలనలో ఉంచి ఎంతకూ హార్ట్‌బీట్‌ పెరగకపోవడంతో శుక్రవారం శాశ్వత పేస్‌మేకర్‌ను అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. గతేడాది ఆగస్టులోనే అశోక్‌కుమార్‌కు గుండె శస్త్రచికిత్స జరిగింది. ఈ క్రమంలో మళ్లీ హృదయ సంబంధ సమస్యే రావడంతో మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌ నుంచి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని