‘ఈ-ఆఫీస్‌’ అప్‌గ్రేడ్‌ ప్రక్రియ వాయిదా

రాష్ట్రంలో ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడ్‌ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

Published : 18 May 2024 04:16 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడ్‌ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఎన్‌ఐసీ అందుకోసం ఏర్పాట్లు చేసింది. కానీ, రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు కొన్ని రోజుల ముందు ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడ్‌కు పూనుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పేరుతో ప్రభుత్వ కార్యాలయాల్లోని కీలక దస్త్రాల్ని మాయం చేసేందుకే వైకాపా ప్రభుత్వం సిద్ధమైందన్న ఆరోపణలు వచ్చాయి. అప్‌గ్రేడ్‌ ప్రక్రియను నిలిపివేయాలని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాలకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐసీ ప్రతినిధుల్ని పింపించి మీనా ఆరా తీశారు. ప్రతిపక్షాల ఫిర్యాదు నేపథ్యంలో దాన్ని వాయిదా వేయాలని ఆయన ఆదేశించారు. తదుపరి షెడ్యూల్‌ను మళ్లీ విడుదల చేస్తామని, అప్పటి వరకు పాత ఈ-ఆఫీస్‌ వెర్షన్‌తోనే విధులు నిర్వర్తించాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని