వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి

ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Updated : 18 May 2024 05:12 IST

బాండ్‌ పేపర్‌లో పేర్కొన్న రూ. 20 లక్షలు కూడా
వెంటనే చెల్లించకుంటే చర్యలు
అనధికారికంగా సెలవు పెట్టిన స్పెషాల్టీ వైద్యులకు అధికారుల ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. లేదంటే న్యాయ, శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులుగా పనిచేసే వారు ఇన్‌-సర్వీస్‌ కోటాలో పీజీ వైద్య విద్యను పూర్తిచేసే అవకాశం ఉంది. దాన్ని పూర్తిచేసిన అనంతరం అయిదేళ్ల పాటు తప్పనిసరిగా మళ్లీ ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేయాలి. లేదంటే ఆ సమయంలో పొందిన వేతనాలతో పాటు అదనంగా రూ.20 లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు అంగీకారం తెలుపుతూ.. బాండ్‌ పేపరుపై సంతకాలు పెడుతున్నారు. అయితే పీజీ వైద్య విద్యను పూర్తిచేసిన వారిలో కొందరు విధుల్లో చేరిన తర్వాత అర్ధంతరంగా మానేసి వెళ్లిపోతున్నారు. ఇంకొందరు అసలు విధులకు హాజరు కావడం లేదు. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలోని ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో ఈ పరిస్థితి నెలకొంది. విధులకు హాజరుకావాలని ప్రభుత్వం వారికి పలుమార్లు సంజాయిషీ నోటీసులు పంపినా అనధికారికంగా సెలవులో వెళ్లిన వారు స్పందించ లేదు. దీంతో బాండ్‌లో పేర్కొన్న రూ. 20 లక్షలు, ప్రభుత్వం నుంచి పొందిన వేతనాల్ని జూన్‌ 15 లోగా చెల్లించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ పద్మావతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేడియాలజీ, ఆంకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, ఇతర స్పెషాల్టీ వైద్యులు ఈ జాబితాలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని