గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!

ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.

Published : 18 May 2024 04:59 IST

ముడుపులు చెల్లించనిదే పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులు
సత్వర సేవలందించే విధానానికి పట్టణ స్థానిక సంస్థల్లో తూట్లు

ఈనాడు-అమరావతి: ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. పలువురు అధికారులు, ఉద్యోగుల బాధ్యతా రాహిత్యం కారణంగా  ప్రజలు మళ్లీ యథావిధిగా పుర, నగరపాలక సంస్థల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తుల్లో చాలావరకు గడువులోగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిల్లో వీటిపై సమీక్షించి ఆదేశాలివ్వాల్సిన ఉన్నతాధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రజలకు త్వరితగతిన సేవలందించాలన్న ఉద్దేశం నీరుగారుతోంది. ఉదాహరణకు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 17 వరకు వివిధ సేవలకు 123 పట్టణ స్థానిక సంస్థల్లో 24,724 మంది దరఖాస్తు చేశారు. వీటిలో గడువులోగా 15,067 పరిష్కారమవ్వగా, 9,657 అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిలో ఆస్తి పన్ను సంబంధిత అంశాలు, వ్యాపార లైసెన్సుల జారీ, నీటి ఛార్జీలు వంటివి అత్యధికంగా ఉన్నాయి.

జవాబుదారీతనం ఏదీ?

పట్టణ స్థానిక సంస్థల ఉద్యోగుల్లో జవాబుదారీతనం కోసం.. వారు ప్రజలకు అందించే వివిధ సేవలపై గడువు విధించి అమలు చేసే విధానం అస్తవ్యస్తంగా తయారైంది. గడువులోగా సేవలు అందించని సంబంధిత ఉద్యోగుల నుంచి అపరాధ రుసుంలు వసూలు చేయాలన్న ఆదేశాలూ అమలుకు నోచుకోవడం లేదు. ఈ విధానంపై పర్యవేక్షణ లోపించడంతో ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదు. కొత్త ఇళ్లు, భవనాలకు ఆస్తి పన్ను విధింపు, పన్ను చెల్లింపుదారుల పేర్లలో సవరణలు, ఖాళీ స్థలాలకు పన్ను వేయడం, కొత్త వ్యాపార లైసెన్సుల జారీ, ఇంటి నిర్మాణానికి అనుమతులు.. ఇలా అనేక రకాల దరఖాస్తులు పట్టణ స్థానిక సంస్థలకు ప్రజల నుంచి వస్తుంటాయి. వాటికి గడువు విధించడం ద్వారా ప్రజలకు సత్వరం సేవలు అందడంతోపాటు అవినీతిని నిరోధించొచ్చన్న ఉద్దేశం పక్కదారి పడుతోంది. ముడుపులు చెల్లించందే పనులు చేయడం లేదు. నగరపాలక సంస్థల్లో ఇలాంటి బెడద ఎక్కువగా ఉంది. చెప్పిన మొత్తాలు ఇవ్వకపోతే ఉద్యోగులు కొర్రీలు పెట్టి దరఖాస్తులను పక్కన పెడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధాన నగరాల్లో ఇలా..

  • మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో 47 రోజుల్లో వివిధ సేవల కోసం 3,995 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో నిర్దేశించిన గడువు దాటినా 1,425 పెండింగ్‌లో ఉన్నాయి. గడువులోగా మరో 1,016 ప్రాసెస్‌ చేసినా ఇంకా పరిష్కారం కాలేదు. 
  • గుంటూరు నగరపాలక సంస్థలో గత నెల 1 నుంచి ఈ నెల 17 వరకు వివిధ సేవల కోసం వచ్చిన 1,345 దరఖాస్తుల్లో 751 పరిష్కరించారు. 594 అపరిష్కృతంగా ఉన్నాయి. 
  • విజయవాడ నగరపాలక సంస్థలో 1,697 దరఖాస్తుల్లో 917 పరిష్కరించారు. గడువు ముగిసినా 266 పెండింగ్‌లో ఉన్నాయి.
  •  కడప నగరపాలక సంస్థలో 1,628 దరఖాస్తులు రాగా, వాటిలో 353 పరిష్కారానికి నోచుకోలేదు.
  • తిరుపతి నగరపాలక సంస్థలో 503 దరఖాస్తుల్లో 349 పరిష్కరించగా.. 154 పెండింగ్‌లో ఉన్నాయి. గడువు ముగిసినా 17 దరఖాస్తులను ప్రాసెస్‌ చేయలేదు.
  • కాకినాడ నగరపాలక సంస్థలో 734 దరఖాస్తుల్లో 554 పరిష్కరించారు. 45 పరిశీలనకు తీసుకోలేదు.
  • అనంతపురం నగరపాలక సంస్థకు వచ్చిన 359 దరఖాస్తుల్లో 165 పరిష్కరించారు. గడువు ముగిసినా 50 పరిశీలనకు నోచుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని