చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Published : 18 May 2024 05:01 IST

రాష్ట్రంలో వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు 4.42 లక్షలు
ఎత్తుకు తగ్గ బరువు లేని వారు 1.31 లక్షలు
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇటీవల నిర్ధారించిన వివరాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు 4.42 లక్షల మంది ఉంటే... ఇందులో 1.13 లక్షల మందిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువులేని వారూ అధికంగానే ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏప్రిల్‌లో సేకరించిన వివరాలే ఈ చేదు వాస్తవాన్ని నిర్ధారించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువు వివరాలు సేకరించి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ యాప్‌లో నమోదు చేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఆ వివరాలను సరిచూసి లోపాలను అంచనా వేస్తారు. ఈ మేరకు రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 5 ఏళ్ల లోపు పిల్లలు 24.53 లక్షల మంది ఉండగా.. ఏప్రిల్‌లో 22.96 లక్షల మంది ఎత్తు, బరువువంటి వివరాలు సేకరించి, నమోదు చేశారు.

ఒక్కరిలోనే రెండు, మూడు సమస్యలు

వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేకపోవడం; ఎత్తుకు తగ్గ బరువు పెరగకపోవడాన్ని చిన్నారుల్లో పోషకాహార లోపాలుగా భావిస్తారు. ఈ ప్రకారం గత నెలలో నమోదైన వివరాలను పరిశీలించి ఎంత మంది చిన్నారులు ఏ ఏ సమస్యలో బాధపడుతున్నారో గుర్తించారు. 

  • 1.31 లక్షల మంది చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు లేక బాధపడుతున్నారు. 33,503 మందిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
  • 2.12 లక్షల మంది వయసుకు తగ్గ బరువు పెరగలేదు. 31,562 మందిలో ఈ లోపం తీవ్రంగా ఉంది.
  • 50 వేల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. 21,687 మంది ఊబకాయం బారినపడ్డారు. 
  • కొంతమంది పిల్లలు రెండు, మూడు సమస్యలూ ఎదుర్కొంటున్నారు. 
  • 2023 మేలో వయసుకు తగ్గ బరువు లేని చిన్నారులు 1,07,174 మంది, ఎత్తుకు తగ్గ బరువు లేని వారు 1,92,208 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 
  • వయసుకు తగ్గ బరువు పెరగని చిన్నారులు కర్నూలు జిల్లాలో 38 వేల మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 28 వేల మంది ఉన్నారు. అల్లూరి జిల్లాలో 11 వేల మంది, కర్నూలులో 10 వేల మంది చిన్నారులను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పలు సమస్యలతో బాధపడుతున్న చిన్నారులూ ఈ జిల్లాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. 

మేలో ఇప్పటికీ అందని పోషకాహారం...

రాయలసీమ జిల్లాల్లో మే నెల పోషకాహారం ఇప్పటికీ చాలా అంగన్‌వాడీ కేంద్రాలకు అందలేదు. సాధారణంగా ప్రతి నెల మొదటి వారంలోనే కేంద్రాలకు చేరాలి. కర్నూలు జిల్లాలో 27.57 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 49.75%, అనంతపురం 50%, చిత్తూరు 62%, నంద్యాలలో 76%,  వైఎస్సార్‌లో 76 %, తిరుపతి జిల్లాలో 91 శాతం మేర కేంద్రాలకు మాత్రమే పంపిణీ జరిగింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని