భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు

రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి.

Updated : 19 May 2024 10:59 IST

ఎప్పటికప్పుడు అధిక రెవెన్యూ ఖర్చులు
నియంత్రణ అంతంత మాత్రమే

ఈనాడు, అమరావతి: రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. ప్రతి బడ్జెట్‌లోనూ ఆర్థికమంత్రి రెవెన్యూ లోటును నియంత్రిస్తామని సభకు హామీ ఇచ్చినా అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. మరోవైపు ప్రభుత్వ పథకాల ఖర్చులనే వేరేచోట పేర్కొంటూ మొత్తమ్మీద రెవెన్యూ ఖర్చులు తక్కువ చేసి చూపించి రెవెన్యూ లోటును తగ్గిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరు వరకు ఉన్న పరిస్థితిపై కాగ్‌ తన లెక్కలు వెలువరించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.37,468.75 కోట్లు రెవెన్యూ లోటుగా లెక్కలు తేల్చారు. బడ్జెట్‌ అంచనాల్లో తొలుత రూ.22,316 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. చివరికి వచ్చేసరికి అంచనాలనూ సవరించారు. తాజా సవరణ ప్రకారం రూ.31,534.94 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొనగా అంతకు మించిపోయింది. మరోవైపు వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం రుణాలు తీసుకుంటోంది. కొన్ని పథకాల ఖర్చులను ఆ కార్పొరేషన్ల ఖర్చులుగానే చూపిస్తోంది. ప్రభుత్వ పథకాల ఖర్చులను బడ్జెట్‌ వెలుపల చూపకూడదని ఆర్థిక సంఘం నిబంధనలున్నా రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలకు ఎక్కడ నుంచి నిధులు సమీకరిస్తున్నారో అక్కడే వాటి ఖర్చుగా చూపుతున్నారు. దీనివల్ల రెవెన్యూ ఖర్చులు బడ్జెట్‌లోకి రాకుండా పోతున్నాయి. అన్నీ కలిపితే రెవెన్యూ లోటు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉన్నా ఇలా సర్దుబాటు చేసేస్తున్నారు.

ద్రవ్యలోటులోనూ అదే దోవ..

ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యలోటు కూడా లెక్కకు మిక్కిలి పెరిగిపోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును ప్రభుత్వం రూ.61,765.14 కోట్లుగా చూపించింది. బడ్జెట్‌ వెలుపల చేస్తున్న రుణాల మొత్తాలు ఈ లెక్కలోకి రావట్లేదు. అవీ కలిపితే ఎంత లేదన్నా రూ.లక్ష కోట్ల వరకు చేరిపోయే ప్రమాదం ఉంది. కాగ్‌ ఫిబ్రవరి నెలాఖరు లెక్కల ప్రకారం రూ.77,208.45 కోట్లు ద్రవ్యలోటుగా చూపినా మార్చి నెలాఖరుకు సవరించారు. కార్పొరేషన్ల రుణాలు తీర్చేందుకు ప్రభుత్వ ఖజానా నుంచే అసలు, వడ్డీ చెల్లిస్తున్నా ఈ లెక్కల్లో వాటికి చోటు దక్కట్లేదు. కాగ్‌ ప్రతి నెలా కార్పొరేషన్ల నుంచి సమీకరించిన రుణాల మొత్తం వివరాలు తమకూ తెలియజేయాలని కోరుతోంది. మరో ఆర్థిక సంవత్సరం గడిచినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ లెక్కలను కాగ్‌కు అందించలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని