కిర్గిజ్‌స్థాన్‌లో దాడులు.. ఇక్కడి తల్లిదండ్రుల్లో ఆందోళన

కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో గత రెండు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వైద్య విద్యకు ఏపీ నుంచి కిర్గిజ్‌స్థాన్‌ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

Updated : 19 May 2024 07:33 IST

విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్న అల్లరిమూకలు
వైద్య విద్య చదివేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులు

కిర్గిజ్‌స్థాన్‌లోని ఓ విశ్వవిద్యాలయ వసతి గృహంలో స్థానికులతో రాజాం ప్రాంత విద్యార్థులు

ఈనాడు, అమరావతి: కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో గత రెండు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వైద్య విద్యకు ఏపీ నుంచి కిర్గిజ్‌స్థాన్‌ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానికులకు, ఈజిప్ట్‌ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ తర్వాత అల్లరి మూకలు విదేశీ విద్యార్థులపై దాడులు చేయడం ప్రారంభించాయి. వారు ఉంటున్న మెడికల్‌ విశ్వవిద్యాలయాల వసతిగృహాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. కిర్గిజ్‌స్థాన్‌లో వైద్య విద్య చదివేందుకు భారత్‌ నుంచి ఎక్కువగా విద్యార్థులు వెళతారు. జీవన వ్యయం, వైద్య విద్యకు ఫీజులు తక్కువగా ఉండటంతో ఈ దేశాన్ని ఎంచుకుంటున్నారు. అక్కడ భారత్‌కు చెందిన విద్యార్థులు సుమారు 14,500 వరకు ఉన్నట్లు సమాచారం. పశ్చిమగోదావరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన కొంతమంది తెలుగు విద్యార్థులు వైద్య విద్య చదివేందుకు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. క్లినికల్‌ శిక్షణ సహా 5-6 ఏళ్ల ఎంబీబీఎస్‌ కోర్స్‌కు కిర్గిజ్‌స్థాన్‌లో సుమారు రూ. 22 లక్షల వరకు వ్యయమవుతోంది. అదే మన దేశంలో ఒక్క ఏడాదికే రూ.25 లక్షలు ఖర్చవుతోంది. దీంతో తక్కువ ఫీజులతో వైద్య విద్యను అందిస్తున్న కిర్గిజ్‌స్థాన్‌లో భారత విద్యార్థులు ఎక్కువగా ప్రవేశాలు పొందుతున్నారు. బిష్కెక్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉండాలని భారత కాన్సులేట్‌ సూచించింది. భారత రాయబార కార్యాలయంతో నిత్యం అందుబాటులో ఉండాలని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సూచించారు.

రాజాం నుంచే 12-15 మంది 

రాజాం, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన వి.వంశీ, ఎ.దినేష్, సీహెచ్‌ సురేంద్ర, జి.సోమేష్, నవీన్, భార్గవ్, బి.రేష్మ, గండి సోమేశ్వరరావు తదితర 12 నుంచి 15 మంది విద్యార్థులు కిర్గిజ్‌ రష్యన్‌ స్లావిక్‌ విశ్వవిద్యాలయం, మరికొన్ని వర్సిటీల్లో చదువుతున్నారు. వీరితో తల్లిదండ్రులు మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. గొడవలు వేరే వసతి గృహాల పరిధిలో జరిగాయని, తమకు ఎలాంటి ఇబ్బంది లేదని విద్యార్థులు చెప్పినట్లు పలువురు తల్లిదండ్రులు ‘న్యూస్‌టుడే’కు శనివారం తెలిపారు. వారు తెలిపిన ప్రకారం.. వర్సిటీల యాజమాన్యాలు విద్యార్థులను వసతి గృహాలకు పరిమితం చేసి గేట్లను మూసేశాయి. స్థానిక పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం ద్వారా ఆందోళనకారులను వసతి గృహాల్లోకి రాకుండా నిలువరించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి హాస్టల్‌లో నలుగురు ప్రొఫెసర్‌లను విద్యార్థులకు తోడుగా ఉంచారు. పరిస్థితి సద్దుమణగకపోతే వారం రోజులపాటు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు అక్కడి విశ్వవిద్యాలయాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని