కోడ్‌ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సస్పెన్షన్‌

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్‌ చేస్తూ రిజిస్ట్రార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Published : 19 May 2024 03:48 IST

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్‌ చేస్తూ రిజిస్ట్రార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆమె.. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు భార్య. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ఈ నెల 4న గాజువాకలో పల్లా శ్రీనివాసరావుకు మద్దతుగా లావణ్య దేవి ఇంటింటి ప్రచారం చేపట్టారంటూ రిటర్నింగ్‌ అధికారి ఆమెకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుకు ఆమె స్పందిస్తూ.. ప్రచారంలో పాల్గొన్న శ్రీవాణి అనే మహిళను వ్యక్తిగత పనిమీద కలిసేందుకు వెళ్లానని, స్వతహాగా ఎన్నికల ర్యాలీలో పాల్గొనలేదని వివరణ ఇచ్చారు. తర్వాత ఎన్నికల హడావుడి, పనుల నేపథ్యంలో రిటర్నింగ్‌ అధికారి ఆమె ఇచ్చిన వివరణను ఉన్నతాధికారులకు పంపలేదని తెలిసింది.  కానీ జిల్లా ఎన్నికల అధికారి నుంచి వచ్చిన సూచనల మేరకే శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్‌ చేసినట్లు వర్సిటీ అధికారులు పేర్కొనడం గమనార్హం. సస్పెన్షన్‌ సమయంలో ఆమె ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా పాటించాలని, రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వకుండా జిల్లా కేంద్రం దాటి వెళ్లకూడదని ఆదేశించారు. వైకాపాకు ఓటేయని ఉద్యోగులను వదిలిపెట్టబోమని, వారికి భవిష్యత్తు లేకుండా చేస్తామని ఎన్నికల ముందు, తర్వాత వర్సిటీ ఉన్నతాధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఏయూలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని