‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!

రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

Published : 19 May 2024 04:01 IST

పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు
తనిఖీలు, పర్యవేక్షణ చేయని రవాణా, పోలీస్, ఎన్‌హెచ్‌ శాఖలు
ఈనాడు, అమరావతి

రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరిచిపోక ముందే.. శనివారం అనంతపురం జిల్లా గుత్తి వద్ద ఓ కారు ప్రమాదానికి గురై ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో సగటున నెలకు 1,600 ప్రమాదాలు జరిగితే.. 660 నుంచి 680 మంది ప్రాణాలు కోల్పోతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంత ప్రాణనష్టం జరుగుతున్నా ప్రమాదాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టిపెడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. 

ప్రమాదం.. కారణం

బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు వేగంగా వెళ్లి, చిలకలూరిపేట సమీపంలో పసుమర్రు వద్ద టిప్పర్‌ను ఢీకొంది. టిప్పర్‌ డీజిల్‌ ట్యాంక్‌ పగలడంతో ఒక్కసారిగా మంటలంటుకొని బస్సు, టిప్పరు దగ్ధమైపోయాయి. ఆ రెండు వాహనాల డ్రైవర్లు, బస్సులోని నలుగురు మంటల్లో చిక్కుకొని చనిపోయారు. 

కారణం: బస్సు నడిపిన వ్యక్తే. వాస్తవానికి అతను క్లీనర్‌. పైగా మద్యం మత్తులో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న అతనికి బస్సు యజమాని స్టీరింగ్‌ ఇచ్చాడు.

ఏం చేయాలి: ఆర్టీసీలో చేసినట్లు ప్రైవేటు ట్రావెల్స్‌ కూడా డ్రైవర్, క్లీనర్లకు నిత్యం బ్రీత్‌ ఎనలైజర్లతో తనిఖీలు చేయాలి. అటువంటి  తనిఖీలు లేకపోవడంతో చాలా మంది దర్జాగా మద్యం తాగి స్టీరింగ్‌ పడుతున్నారు.

అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో హైవేపై శనివారం తెల్లవారుజామున కారు వేగంగా అనంతపురం వైపు వెళ్తోంది. నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్‌ రెప్పవాల్చడంతో వాహనం అదుపు తప్పింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అంతే.. కారు డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి మినహా, అందులోని ఆరుగురూ చనిపోయారు. 

కారణం: డ్రైవర్‌ విశ్రాంతి లేకుండా కారు నడపడం.

ఏం చేయాలి:  డ్రైవర్లు నిద్ర మత్తులో ఉన్నప్పుడు అప్రమత్తం చేసే సాంకేతికత అందుబాటులో ఉంది. ప్రతి వాహనానికి దాన్ని తప్పనిసరి చేసేలా నిబంధనలు రూపొందించాలి.

ఆర్టీసీ అమరావతి ఏసీ సర్వీస్‌ బస్సు బుధవారం విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తుండగా.. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్‌ జంక్షన్‌ సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయాడు.

కారణం: బస్సు డ్రైవరు వేగాన్ని నియంత్రించలేకపోయాడు.

ఏం చేయాలి: లారీలు, టిప్పర్లకు వెనుక రేడియం స్టిక్కర్లు ఉన్నాయా.. అవి వెనుక వచ్చే వాహన డ్రైవర్లను అప్రమత్తం చేయగలుగుతాయా అనేది తనిఖీల్లో భాగంగా పరిశీలించాలి.


చలానాలు రాయడమే లక్ష్యంగా.. 

రవాణాశాఖ అధికారులు కొంతకాలంగా రోడ్లపై వాహనాల తనిఖీలు మరిచిపోయారు. ప్రభుత్వం నిర్దేశించిన రాబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి జరిమానాలపై దృష్టి పెట్టారు. వేగ నియంత్రణ, మద్యం మత్తులో డ్రైవర్లు వాహనాలు నడపకుండా చూడటం అనే పనులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పోలీసులూ వాహనాల తనిఖీ వదిలేశారు. అతివేగంగా దూసుకెళ్తున్న వాహనాలను నిఘా కెమెరాలతో గుర్తించి వెంటనే కళ్లెం వేయాలి. సంబంధిత వాహన యజమాని సెల్‌ఫోన్‌కు సందేశం పంపి అప్రమత్తం చేయాలి. పోలీసులు ఈ మార్గాలపై దృష్టి పెట్టడం లేదు.


ఎన్‌హెచ్‌ అధికారులదీ నిర్లక్ష్యమే

జాతీయ రహదారులపై లారీలను ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు. హోటళ్లు, దాబాలు, ఇతర దుకాణాల వద్ద హైవేకి ఆనుకొని  నిలుపుతున్నారు. వేగంగా వచ్చే వాహనాలు వాటిని ఢీ కొడుతున్నాయి. వాస్తవానికి లారీలను హైవేలపై ఉండే ట్రక్‌ లే బైస్‌లో మాత్రమే నిలపాలి. ఒక్కో దాంట్లో 10-15 లారీలు నిలపొచ్చు. కానీ, అక్కడ సౌకర్యాలు ఉండటం లేదు. కనీసం లైట్లూ కనిపించవు. దీంతో ఇష్టానుసారంగా లారీలను ఆపేస్తున్నారు. హైవేపై ప్రతి 60-70 కి.మీ.లకు 2, 3 ఎకరాల విస్తీర్ణంలో అన్ని సదుపాయాలతో ట్రక్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయాలి. ఇది డ్రైవర్లకు విశ్రాంతి ప్రాంతం వంటిది. రాష్ట్రంలోని హైవేల్లో మూడు, నాలుగు చోట్ల మాత్రమే ఈ ఏర్పాటు ఉంది. టోల్‌ వసూలు చేస్తున్న గుత్తేదారు వీటిని పట్టించుకోవడం లేదు. అధికారులూ గుర్తుచేయడం లేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని