రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?

‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ ప్రశ్నించారు.

Updated : 19 May 2024 09:28 IST

ఉదయం ఆలస్యంగా బడికొచ్చి.. సాయంత్రం ముందే వెళ్లిపోతున్నారు
ఉపాధ్యాయులతో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌

తణుకు, న్యూస్‌టుడే: ‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ ప్రశ్నించారు. శనివారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు ఎన్టీఆర్‌ ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో ప్రభుత్వ బడులు 20 శాతం వెనుకబడి ఉన్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నా పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించకపోవడడానికి నిర్లక్ష్యమే కారణం. రూ. కోట్లు వెచ్చించి సౌకర్యాలు కల్పిస్తున్నా ఫలితాలు మెరుగుపడటం లేదు. ఉదయం ఆలస్యంగా వచ్చినా సాయంత్రం మాత్రం నిర్దేశిత సమయం కంటే ముందే వెళ్లిపోతున్నారు. ఒక్కో తరగతి ఉపాధ్యాయుడికి సగటున 20 నుంచి 25 మంది పిల్లలే ఉంటున్నారు. ఒక వాలంటీరు 50 ఇళ్లను చూస్తుంటే కనీసం ఒక ఉపాధ్యాయుడు 50 మంది పిల్లలను చూడలేరా? ఆరో తరగతి నుంచే పిల్లలకు ప్రతి యూనిట్‌లో 70 శాతం మార్కులు రావాలి. పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు తక్కువగా ఉంటే దానిపై వారి తల్లిదండ్రులతో చర్చించాలి. మీకు జీతాలుగా ఇచ్చేది ఉచిత సొమ్ము కాదు... ప్రజలందరిదని గుర్తించుకోవాలి’ అని పేర్కొన్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంపై ఆయాలు ఆయన్ను కలవగా మూడు రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని