తప్పిన విద్యుత్‌ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!

వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది.

Updated : 20 May 2024 05:42 IST

వాతావరణ మార్పులతో గణనీయంగా తగ్గిన డిమాండ్‌ 
ఎస్‌టీఓఏ ఒప్పందాలతో ‘జెన్‌కో థర్మల్‌’ బ్యాక్‌డౌన్‌
తక్కువ ధరకొచ్చే 15 ఎంయూలు కోల్పోవడంతో నష్టం

ఈనాడు, అమరావతి: వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఆ మొత్తాన్ని డిస్కంలు ట్రూఅప్‌ పేరుతో ప్రజలపై మోపనున్నాయి. ఈ ఏడాది మే నెలలో 270 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) గరిష్ఠ డిమాండ్‌ ఉంటుందని రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) అంచనా వేసింది. కానీ, ఈ నెల 4న నమోదైన 259.17 ఎంయూలే ఇప్పటి వరకు అత్యధికం. డిమాండ్‌ అంచనాల ఆధారంగా 3,640 ఎంయూల విద్యుత్‌ను స్వల్పకాలిక ఒప్పందాల (షార్ట్‌టర్మ్‌ ఓపెన్‌ యాక్సెస్‌-ఎస్‌టీఓఏ) ద్వారా కొనుగోలుకు డిస్కంలు వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం.. వచ్చే నెల జూన్‌ వరకు విద్యుత్‌ అందుతుంది. ఎస్‌ఎల్‌డీసీ వేసిన అంచనాల మేర డిమాండ్‌ లేకపోవడంతో ఎస్‌టీఓఏ ద్వారా అందే దానిలో సుమారు 15 ఎంయూలు మిగిలిపోతోంది. ఆ మేరకు ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి 45% ఉత్పత్తి తగ్గించాల్సిన (బ్యాక్‌డౌన్‌) పరిస్థితి ఏర్పడింది. ఎస్‌టీఓఏ ద్వారా అధిక ధర చెల్లించడం వల్ల రోజుకు రూ.5.76 కోట్ల చొప్పున అదనపు భారం పడుతోంది. రాష్ట్రంలో రాబోయే 45 రోజుల్లో విద్యుత్‌ డిమాండ్‌లో పెద్దగా మార్పులు లేకుంటే.. ఎస్‌టీఓఏ ద్వారా కొనుగోలు చేసే విద్యుత్‌ వల్ల 45 రోజుల్లో (విద్యుత్‌ డిమాండ్‌ 200 నుంచి 210 ఎంయూల మధ్య ఉండే రోజులకు) అదనపు భారం సుమారు రూ.259 కోట్లు ఉంటుందని అంచనా. 

డిమాండ్‌ లెక్కలు తారుమారు

ఎస్‌టీఓఏ ఒప్పందం ద్వారా రోజుకు సుమారు 35 ఎంయూల విద్యుత్‌ను డిస్కంలు తీసుకుంటున్నాయి. వాతావరణ మార్పులతో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గింది. అది శనివారం 210.35 ఎంయూలకు తగ్గింది. ప్రస్తుతం డిమాండ్‌ తగ్గినా.. ఎస్‌టీఓఏ ద్వారా రోజుకు 19.75 ఎంయూల చొప్పున తీసుకుంటున్నారు. అందుకు యూనిట్‌కు సగటున రూ.8.69 చొప్పున డిస్కంలు చెల్లిస్తున్నాయి. ఒప్పందం ప్రకారం జూన్‌ వరకు ఇలా తీసుకోవాలి. దీనివల్ల జెన్‌కో థర్మల్‌ కేంద్రాల నుంచి యూనిట్‌కు సగటున రూ.4.85 చొప్పున తక్కువ ధరకు అందే విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ఎస్‌టీఓఏ ద్వారా తీసుకునే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.3.84 చొప్పున అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఒప్పందం నుంచి సుమారు 15% వెనక్కిచ్చినా, ఇంకా 15 ఎంయూల వరకు మిగులు ఉంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని