అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె

తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది.

Updated : 20 May 2024 05:25 IST

గంటల వ్యవధిలోనే రెండు ఘటనలు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం

నెల్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. ఈ ఘటనలతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పడారుపల్లికి చెందిన ఉదయగిరి మల్లికార్జున, యామిని దంపతులకు యమున (18) తులసి (16), యశశ్రీ ముగ్గురు కుమార్తెలు. తులసి మానసిక వైకల్యంతో జన్మించింది. మల్లికార్జున 2012 వరకు సైన్యంలో పనిచేసి, ప్రస్తుతం బ్యాంక్‌ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం యమున అనారోగ్యానికి గురవడంతో చెన్నైలో శస్త్రచికిత్స చేయించారు. ఇంటికి వెళ్లిపోవచ్చు అనుకుంటున్న సమయంలో హైబీపీకి గురై శనివారం ఆసుపత్రిలోనే మృతిచెందారు. సాయంత్రం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా అక్కను చూస్తూ తులసి (16) చాలాసేపు మౌనంగానే ఉండిపోయింది. అనంతరం కొన్ని గంటల్లోనే ప్రాణం విడిచింది. మొదటి బిడ్డ మృతి చెందడం, ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలోనే రెండో కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ నెల 24న యమున పుట్టినరోజు కావడంతో వేడుకలు చేసుకోవాలని ఆమె స్నేహితులు అనుకున్నారు. ఇంతలోనే ఇలా తమను వదిలి వెళ్లిపోవడంతో వారంతా యమున మృతదేహం ముందు రోదిస్తూ కేక్‌ కట్‌ చేశారు. స్నేహితురాలికి కన్నీటి వీడ్కోలు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని