ముగ్గురు ఐపీఎస్‌లపై అభియోగాల నమోదు

రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్‌ బర్దర్, బిందుమాధవ్‌ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది.

Updated : 20 May 2024 05:23 IST

క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం
15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా వాదనలు వినిపించాలని ఆదేశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్‌ బర్దర్, బిందుమాధవ్‌ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అఖిలభారత సర్వీసుల (క్రమశిక్షణ, అప్పీలు) నియమావళిలోని ఎనిమిదో నిబంధన ప్రకారం ఈ ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసింది. వాటిపై 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా సంబంధిత అధికారి ఎదుట వాదనలు వినిపించాలని ఆదేశించింది. నమోదు చేసిన అభియోగాలకే వాదనలు పరిమితం కావాలని తెలిపింది. నిర్దేశిత గడువులోగా వాదనలు వినిపించకపోతే ఇప్పటికే తమవద్ద ఉన్న వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ కేసు విచారణలో రాజకీయ నాయకులతో లేదా ఇతరులతో ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని.. సిఫార్సులు చేయించకూడదని వివరించింది. అలా చేస్తే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ముగ్గురు ఐపీఎస్‌ అధికారులపై నమోదు చేసిన అభియోగాలివి... 

శాంతిభద్రతల పరిరక్షణలో విఫలం

పల్నాడు జిల్లా ఎస్పీగా బిందుమాధవ్‌ శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారు. దీంతో పోలింగ్‌ రోజున అల్లరిమూకలు 15 ఈవీఎంలను ధ్వంసం చేశాయి. ఆ ఒక్కరోజే జిల్లాలో 20 హింసాత్మక ఘటనలు జరిగాయి. తగినంత మంది పోలీసులు, భద్రతా సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ ఎస్పీ హింసను ఆపలేకపోయారు. పోలింగ్‌ మర్నాడు రాళ్లు విసరడం, ఆస్తుల విధ్వంసం వంటి ఏడు తీవ్రమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. విధి నిర్వహణలో వృత్తిపరమైన నిబద్ధత కనబర్చలేకపోయారు. 

హింసాకాండను పసిగట్టలేదు

అనంతపురం ఎస్పీగా అమిత్‌ బర్దర్‌ ఈ నెల 13, 14 తేదీల్లో తాడిపత్రిలో చెలరేగిన హింసాకాండను అరికట్టడంలో విఫలమయ్యారు. రెండురోజుల పాటు ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడం, పోలీసు వాహనాలు ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ హింసాకాండలో పోలీసులకూ గాయాలయ్యాయి. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో తాడిపత్రిలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించినా పట్టించుకోలేదు. భద్రతాసిబ్బందిని సరిగా వినియోగించుకోలేకపోవడంతో విధ్వంసం చోటుచేసుకుంది. 

ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదు

తిరుపతి ఎస్పీగా కృష్ణకాంత్‌ పటేల్‌ హింసాత్మక ఘటనల నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదు. చంద్రగిరిలో గత ఎన్నికలప్పుడూ హింస చెలరేగింది. అది తెలిసినా ఎస్పీ అప్రమత్తంగా వ్యవహరించలేదు. పోలింగ్‌ రోజు వైకాపా అభ్యర్థి వాహనాన్ని తెదేపా వాళ్లు తగలబెట్టారు. మర్నాడు తిరుపతిలో తెదేపా అభ్యర్థిపై వైకాపా వర్గీయులు దాడిచేశారు. అభ్యర్థి భద్రతా సిబ్బంది గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే ఇరు పార్టీలవారూ పెద్దసంఖ్యలో చేరుకుని రాళ్లు విసురుకున్నారు. 144 సెక్షన్‌ విధించినా ఇలాంటి ఘటనలు జరిగాయంటే నిఘావైఫల్యమే కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని