విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!

ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి.

Published : 20 May 2024 06:03 IST

భారీగా పిల్లల సంఖ్య పడిపోయినా ఇన్నాళ్లూ బయటపెట్టని సర్కారు
‘విద్యా కానుక’ లెక్కలతో ఇప్పుడు బయటపడిన బాగోతం
ఈనాడు - అమరావతి

ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. 2024-25 విద్యా సంవత్సరం కోసం పాఠశాల విద్యాశాఖ ‘విద్యా కానుక’ కొనుగోళ్లు నిర్వహిస్తోంది. ఇందుకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా గుత్తేదార్లకు ఆర్డర్‌ ఇచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులు కేవలం 35.69 లక్షలు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. 2023-24 సంవత్సర విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ ఆర్డర్‌ ఇచ్చింది. ఏటా క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నందున అదనపు కొనుగోళ్లు లేకుండా వాస్తవ సంఖ్య ప్రకారమే కొనుగోలు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. వైకాపా సర్కార్‌ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన సంస్కరణలతో బడులు అధ్వానంగా మారాయి అనడానికి తగ్గిపోయిన పిల్లల ప్రవేశాలే నిదర్శనం.

2018-19లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ కలిపి

39.29 లక్షల పిల్లలు ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 3.59 లక్షలు తగ్గింది. గత తెదేపా ప్రభుత్వంతో పోల్చి చూస్తే విద్యార్థుల చేరికలు తగ్గిపోయాయి. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా విద్యార్థుల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొనేది. అందరూ తెలుసుకునే వీలుండేది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నందున 2021 నుంచి వెబ్‌సైట్‌ నుంచి పిల్లల వివరాలు తొలగించింది. 

ఏటా లక్షన్నరకుపైగా తగ్గుదల

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలు లక్ష్యానికి అనుగుణంగా ఉండడం లేదు. ప్రభుత్వంలోని అన్ని యాజమాన్యాల్లో కలిపి ఏటా దాదాపు 3.91 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసి, వెళ్లిపోతున్నారు. ఇదే స్థాయిలో ఒకటో తరగతిలో చేరికలు ఉండడం లేదు. గత రెండు, మూడేళ్లుగా ఒకటో తరగతిలో లక్ష నుంచి లక్షన్నరకుపైగా ప్రవేశాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతోపాటు ప్రైవేటుకు అధికంగా తరలిపోతున్నారు. ఇదే పద్ధతి కొన్నేళ్లు సాగితే ప్రభుత్వ బడులు మూసివేసే పరిస్థితి వస్తుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఉపాధ్యాయులు, బడుల సంఖ్యను తగ్గించేందుకు వైకాపా ప్రభుత్వం చేసిన ప్రయోగం కారణంగానే విద్యార్థుల ప్రవేశాలు దారుణంగా పడిపోతున్నాయి. గతంలో ప్రాథమిక పాఠశాలల్లో 1-5 తరగతులు ఉండేవి. పదేళ్లు వచ్చే వరకు ఊరి బడిలోనే విద్యార్థులు చదువుకునేవారు. మూడో తరగతి నుంచి ‘సబ్జెక్టు టీచర్‌ బోధన’ంటూ చేసిన సంస్కరణ ప్రాథమిక విద్యను దెబ్బతీసింది. ప్రాథమిక బడుల నుంచి చాలా చోట్ల 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత బడులకు తరలించేశారు. దీంతో ఊరి బడిలో 1, 2 తరగతులే మిగిలాయి. వీటిల్లోనూ పిల్లలు తక్కువగా ఉండడంతో కొన్నిచోట్ల మూసేశారు. ఎనిమిదేళ్ల పిల్లలను చదువుకునేందుకు పక్క గ్రామాలకు పంపలేక తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేశారు. దీంతో ఒకటో తరగతిలో ప్రవేశాలు ఉండడం లేదు. 

బడి మానేసిన వారు 1.73 లక్షలు

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న వారిలో ఎక్కువ మంది పేదల కుటుంబాలకు చెందిన వారే. వీరిలో ఎక్కువ మంది మధ్యలో చదువు ఆపేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దీన్ని బయటపెట్టడం లేదు. 2022 అక్టోబరులో గ్రామ, వార్డు సచివాలయ శాఖకు పాఠశాల విద్యాశాఖ పంపిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తరగతుల్లో కలిపి 1,73,416 మంది మధ్యలోనే చదువు ఆపేసినట్లు తెలుస్తోంది. అదే.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సమగ్ర శిక్షా అభియాన్‌ విభాగానికి ఇచ్చిన నివేదికలో మాత్రం 1-5 తరగతుల పిల్లలెవరూ బడి మానేయలేదని తెలిపింది. ఒకవైపు ఇలా పేర్కొంటూనే 1 నుంచి 5 తరగతులకు చెందిన 66,205 మంది బడి మానేశారని, వారిని గుర్తించాలని గ్రామ, వార్డు సచివాలయాల విభాగాన్ని కోరడం గమనార్హం. ఇలాంటి దొంగ లెక్కలతో సర్కారు విద్యను సర్వనాశనం చేసింది. పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తన పరపతిని పెంచుకునేందుకు అరాచకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని