బాధితుల గొంతు వినిపించడం నేరమా?

ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్‌ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా?

Published : 20 May 2024 05:05 IST

అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం అవుతుందా?
ఆవేదనను ప్రసారం చేసినందుకు టీవీ ఛానళ్లపై కేసులు

ఈనాడు, విశాఖపట్నం: ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్‌ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? ఇది నేరపూరిత కుట్రా? బాధితుల ఆవేదనను ఛానళ్లలో చూపిస్తే మీడియా సంస్థలపై కేసు పెడతారా? బర్మా కాలనీకి సంబంధించిన సుంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి వ్యవహారంలో విశాఖపట్నం పోలీసులు ఇదే చేశారు. ఆ బాధితుల ఆవేదనను ప్రసారం చేసినందుకు ఈటీవీ, ఏబీఎన్‌ ప్రతినిధులపై, బాధితులతో కలిసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడినందుకు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుపై ఈ నెల 17న కంచరపాలెం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తమ ఎదుట హాజరు కావాలని మీడియా ప్రతినిధులకు సీఆర్‌పీసీ 91 సెక్షన్‌ కింద నోటీసులిచ్చారు. అయితే ఈ వ్యవహారంపై  

విశాఖ పోలీసులు విచారిస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదని, ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకుని సిట్‌ ద్వారా విచారణ జరిపించాలని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండు చేస్తున్నాయి. 

సిట్‌ దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి..

  • ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై మొత్తం రీ ఇన్వెస్టిగేట్‌ చేయాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండు చేస్తున్నాయి. ఈ కేసును విశాఖపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు వెలుగుచూసే అవకాశం లేదనే వాదన వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఏర్పాటైన సిట్‌ దర్యాప్తు పరిధిలోకి ఈ కేసును తీసుకురావాలని కోరుతున్నాయి.  
  • కంచరపాలెం పోలీసులు తమను లంచం అడిగారని బాధితులు ప్రెస్‌మీట్‌లో చెప్పారు. దీనిపై విశాఖపట్నం పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయట్లేదు? ఈ అంశంపై కూడా దర్యాప్తు చేయాలి. దీన్ని సిట్‌ పరిధిలోకి తీసుకురావాలని ప్రజాసంఘాలు డిమాండు చేస్తున్నాయి. 
  • ఈ అంశాలపై విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. పోలీసు పీఆర్వోతో మాట్లాడితే.. సీపీ అందుబాటులోకి రారని సమాధానమిచ్చారు. 

మాచర్ల, చంద్రగిరి ఘటనలకు ఏ మాత్రం తీసిపోదు..: విశాఖపట్నంలో సుంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి.. మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రిల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు ఏ మాత్రం తీసిపోదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇది కచ్చితంగా ఎన్నికల హింస కిందే పరిగణించాలని పేర్కొంటున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఇది ఎన్నికల హింస కాదని చెప్పేందుకే తాపత్రయపడుతున్నారని విమర్శిస్తున్నాయి. విశాఖలో ఘటన జరిగిన రోజున బాధితులు భయభ్రాంతులకు గురై ఆందోళనలో ఉన్నారు. ఆ సమయంలో వారు ఏం చెప్పారో, పోలీసులు ఏం రాసుకున్నారో ఎవరికీ తెలీదు. కానీ అదేదో కుటుంబ గొడవలు అన్నట్లుగా తేల్చేశారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ‘‘మీ మీద న్యూసెన్స్‌ కేసు పెట్టకూడదంటే రూ.2 లక్షల లంచం ఇవ్వాలి’’ అంటూ కంచరపాలెం పోలీసులు డిమాండు చేశారని బాధితులే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సిట్‌ దర్యాప్తు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. 


పత్రికా స్వేచ్ఛ కూడా రాజ్యాంగం కల్పించిన వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటంలో పత్రికలది అత్యంత కీలకమైన పాత్ర. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమే

రమేష్‌ థాపర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌(1950) కేసులో సుప్రీంకోర్టు. 


విశాఖ ఘటనను ప్రసారం చేసిన మీడియాపై కేసు నమోదు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖపట్నం జీవీఎంసీ 49వ వార్డులో బర్మాక్యాంపు వద్ద సుంకర ధనలక్ష్మి, ఆమె కుమార్తెలు నూకరత్నం, రమ్య, కుమారుడు మణికంఠపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనను ప్రసారం చేసినందుకు ఈటీవీ, ఏబీఎన్‌ ప్రతినిధులపైనా, బాధితులతో కలిసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడినందుకు విశాఖ ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుపైనా ఈ నెల 17న కంచరపాలెం పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. ఐపీసీ 153ఏ, 188, 505(2), 120బీ రెడ్‌విత్‌ 34, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 125 తదితర సెక్షన్ల కింద కేసు బనాయించారు. వ్యక్తుల మధ్య గొడవను వర్గాల మధ్య వైరంగా సృష్టించడంతో పాటు.. నిందితుణ్ని వైకాపా వ్యక్తిగా, బాధితులు తెదేపా వారిగా ప్రసారం చేయడం ద్వారా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచి శాంతి భద్రతల సమస్యకు కారణమయ్యారని పేర్కొన్నారు. దీనిపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని మీడియా ప్రతినిధులకు సీఆర్‌పీసీ 91 సెక్షన్‌ కింద నోటీసులిచ్చారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలని మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ నోటీసులు ఇవ్వడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని