పోలీసులపై ప్రశ్నల పరంపర

పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్‌ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు.

Published : 20 May 2024 06:04 IST

రెండో రోజూ కొనసాగిన సిట్‌ విచారణలు
క్షేత్రస్థాయిలో పరిశీలన
పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన దాడులపై ఆరా
ఈనాడు యంత్రాంగం

తిరుపతి జిల్లా రామిరెడ్డిపల్లెలో వైకాపా అభ్యర్థి మోహిత్‌రెడ్డి గన్‌మెన్‌ను విచారిస్తున్న డీఎస్పీ రవిమనోహరాచారి

పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్‌ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. ఘర్షణలకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? సకాలంలో దాడులను ఎందుకు అరికట్టలేకపోయారు? ఆ తర్వాత ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని స్థానిక పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌లు పరిశీలించారు. దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా కూడా స్థానిక పోలీసులు కొందరు తమ పక్షపాత ధోరణిని కనబరిచారని విపక్ష నాయకులు ఆరోపించారు. 

జనసేన నాయకులు సిట్‌ అధికారులను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుపడ్డారు. వారిని గంటల తరబడి బయటే కూర్చోబెట్టారు. మరోవైపు అధికారపార్టీ నేతలు రాగానే వారిని సిట్‌ అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. ఎన్నికల సంఘం చీవాట్లు పెడుతున్నా పోలీసుల తీరులో మార్పు రాకపోవడం.. ఇంకా వైకాపాకు కొమ్ముకాస్తుండటంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

నరసరావుపేట గ్రామీణ పోలీసుస్టేషన్‌ నుంచి బయటకు వస్తున్న మంత్రి అంబటి రాంబాబు, అనుచరులు

మంత్రికేమో వెంటనే అనుమతి.. 
జనసేన నేతలకు 4గంటల నిరీక్షణ

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్‌ అధికారులను కలిసేందుకు మంత్రి అంబటి రాంబాబుకు వెంటనే అనుమతినిచ్చి, జనసేన నేతలను నాలుగు గంటలకు పైగా బయటే నిలిపివేశారు. ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో రెండోరోజు ఆదివారం సిట్‌ సభ్యులు నరసరావుపేట గ్రామీణ ఠాణాలో విచారణ చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంత్రి అంబటి రాంబాబు ఠాణాకు వచ్చి సిట్‌ సభ్యులను కలిశారు. నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి సత్తెనపల్లి రూరల్‌ సీఐ రాంబాబుపై ఫిర్యాదు చేశారు. ఆయనకు స్థానిక ఎస్సై రోశయ్య ఆహ్వానం పలికారు. సాయంత్రం 6 గంటల తర్వాత వైకాపా వర్గీయుల చేతిలో దెబ్బలు తిన్న నరసరావుపేట మండలం పమిడిపాడుకు చెందిన జనసేన నాయకులు పదిమంది వరకూ వస్తే ఎస్సై రోశయ్య లోపలకు రానివ్వకుండా, సిట్‌ సభ్యులను కలవనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో వారంతా బయటే ఆగిపోయారు. తమకు కలిసే అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడితే సరేనని నాలుగు గంటల పాటు బయటనే ఉంచారు. వైకాపా వర్గీయుల ఫిర్యాదు మేరకు తమకు 41ఏ నోటీసులు పంపారని, కానీ తాము వైకాపా చేతిలో దెబ్బలు తిన్నామని, కౌంటర్‌ ఫిర్యాదు చేస్తే రూరల్‌ పోలీసులు తీసుకోవడం లేదని, ఈ విషయాన్ని సిట్‌ సభ్యులకు తెలిపేందుకు వస్తే రూరల్‌ ఎస్సై కలవనియ్యకుండా అడ్డుకున్నారని జనసేన నేతలు వాపోయారు.


లోపలకు రానివ్వకపోవడంతో బయటే వేచిచూస్తున్న జనసేన నేతలు

  • నరసరావుపేట రూరల్‌ స్టేషన్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలైన సిట్‌ సభ్యుల విచారణ రాత్రి వరకూ కొనసాగింది. రూరల్‌ సర్కిల్‌ పరిధిలో మొత్తం నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో.. దొండపాడు పోలింగ్‌ కేంద్రం వద్ద తెదేపా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంఎల్‌ఏ అభ్యర్థి చదలవాడ అరవిందబాబుల కార్లపై రాళ్ల దాడి జరిగింది. అంతేకాకుండా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లనివ్వకుండా ఇద్దరినీ అడ్డుకోవడమే కాకుండా తోసేశారు. నూజండ్ల మండలం పమిడిపాడులో వైకాపా వర్గీయులు తెదేపా వారిపై దాడి చేశారు. వీటిపై వీడియోలను సిట్‌ సభ్యులు పరిశీలించారు. రూరల్‌ ఎస్సై అధికారపార్టీతో అంటకాగుతున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో దాడులకు సంబంధించి ఎవరెవరిపై ఎలాంటి కేసులు నమోదు చేశారు? వారికి 41ఏ నోటీసులు ఇచ్చారా? అదుపులోకి తీసుకున్నారా వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఒక్క నరసరావుపేట గ్రామీణ ఠాణాలో పత్రాలనే పరిశీలించారు.
  • శ్రీకాకుళం ఏసీబీ ఏఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిట్‌ సభ్యులు రెండోరోజు రెంటచింతల మండలంలో రెంటాల, తుమృకోట, పాలవాయిగేటు గ్రామాల్లో అల్లర్లు జరిగిన ప్రదేశాలను సందర్శించారు. 
  • కారంపూడిలో ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం ఏసీబీ ఏఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిట్‌ సభ్యులు ఘటనా స్థలాలను పరిశీలించారు. అనంతరం ఠాణాకు వెళ్లి రికార్డులు తనిఖీలు చేశారు. ఈ నెల 14న జరిగిన ఘటన ఠాణాకు సమీపంలోనే జరిగినా ఎందుకు త్వరగా అదుపు చేయలేకపోయారు? పరిస్థితి చేయిదాటేవరకూ ఏం చేశారని పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఇరుపార్టీల్లో ఎంతమందిని అరెస్టు చేశారని అడిగి, కొన్ని ఎఫ్‌ఐఆర్‌ పత్రాల జిరాక్స్‌ ప్రతులు తీసుకెళ్లారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు దాచేపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ సురేంద్రబాబును విచారించారు. రెండు ఘటనల్లో బాధితులను పోలీసులే కొట్టి, హింసించిన ఘటనపై సీఐని ప్రశ్నించినట్లు సమాచారం. అనంతరం ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించారు. రెంటచింతల మండలం తుమృకోటలో కొందరు వైకాపాకు చెందినవారు దాచేపల్లికి వచ్చి సిట్‌ సభ్యులను కలిసి దాడి విషయాలను తెలిపారు.

తప్పుడు కేసులు పెట్టారు

సిట్‌ ఎదుట కూచివారిపల్లె గ్రామస్థుల ఆవేదన
పులివర్తి నానిపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు

కూచివారిపల్లెలో విచారిస్తున్న డీఎస్పీ రవిమనోహరాచారి

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం), చంద్రగిరి (గ్రామీణ): తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రామిరెడ్డిపల్లెలో తెదేపా పోలింగ్‌ ఏజెంటుపై వైకాపా నేత కొటాల చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో వైకాపా శ్రేణులు దాడిచేశాయని, అనంతరం కూచివారిపల్లెలో కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించారని గ్రామస్థులు తమ ఆవేదన వెలిబుచ్చారు. దాడి చేసిన వ్యక్తులను వదిలేసి బాధితులపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని సిట్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ బృందం విచారణ చేపట్టింది. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనలపై డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ ప్రభాకర్‌ ఆదివారం విచారణ జరిపారు. చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై శ్రీపద్మావతి వర్సిటీలో జరిగిన దాడి ఘటన, పోలీసులు తీసుకున్న చర్యలను ముందుగా సిట్‌ అధికారులు పరిశీలించారు. ఎస్వీయూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విచారించారు. ఘటన తర్వాత పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎంతమందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు? ఎంతమందిని అరెస్టు చేశారనే విషయాలు పరిశీలించారు. మరోవైపు పులివర్తి నానిపై దాడి ఘటన జరిగిన తర్వాత ఎంతసేపటికి అక్కడికి చేరుకున్నారన్న వివరాలూ పోలీసులను అడిగి తెలుసుకున్నారు. దాడి సమయంలో పులివర్తి నాని కొంతమంది పోలీసు అధికారులకు ఫోన్‌ చేశారని, ఎందుకు స్పందించలేదని వారిని అడిగినట్లు తెలుస్తోంది. అనంతరం నానిపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దాడి ఎలా జరిగింది? నిందితులు ఎలా పారిపోయారు? ఘటనకు వినియోగించిన ఆయుధాల వివరాలు తీసుకున్నారు.

అనంతరం చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెలో పర్యటించి.. 13వ తేదీ రాత్రి దాడులు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. దహనమైన కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిని, వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అక్కడ జరిగిన ఘటనలను సిట్‌ అధికారులకు వివరించారు. రాత్రి 9.03 సమయంలో సుమారు 40 మంది గ్రామంపై పడి అరగంట పాటు దాడిచేశారని.. ప్రతిదాడి జరిగిందన్నారు. ఘటనపై గ్రామంలో అందరం ఓ చోట కూర్చుని ధర్నా చేశామని, ఇదే సమయంలో నాని కుమారుడు వినీల్‌ అక్కడికి వచ్చినట్లు తెలిపారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి ఎవరో నిప్పు పెట్టారని ఘటనతో తమకు సంబంధం లేదని వివరించారు. అనంతరం వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి గన్‌మెన్‌ ఈశ్వర్‌ను విచారించి వివరాలు తీసుకున్నారు.


నివేదికను అధికారులకు అందజేస్తాం
- రవి మనోహరాచారి, డీఎస్పీ

‘ఎన్నికల రోజుతోపాటు మర్నాడు పద్మావతి వర్సిటీ వద్ద పులివర్తి నానిపై దాడి ఘటనలకు సంబంధించిన అన్ని అంశాలపై క్షేత్రస్థాయిలో విచారించాం. నానిపై దాడి జరిగిన ప్రాంతాలను, ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించాం. రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లె గ్రామస్థులతో మాట్లాడాం’ అని సిట్‌ అధికారి, డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. ఎన్నికల అనంతరం జరిగిన గొడవలు.. విధ్వంసాలు.. హత్యాయత్న ఘటనలకు భద్రతా వైఫల్యం, నిర్లక్ష్యమే కారణమని సిబ్‌ బృందం గుర్తించినట్లు సమాచారం. సుమారు ఏడుగంటలపాటు విచారణ చేపట్టిన బృందం ఆదివారం రాత్రి సిట్‌ ఐజీకి నివేదిక సమర్పించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని