పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!

జూన్‌ 1 నుంచి ఖరీఫ్‌ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి.

Published : 20 May 2024 06:04 IST

ఫిబ్రవరిలో కళ్లు మూసుకుని.. మార్చి 16న రబీ కరవు ప్రకటన
ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని తెలిసీ వల్లమాలిన జాప్యం
ఇప్పుడొచ్చి దెబ్బతిన్న పంటలు చూస్తారట.. జాబితాలు తయారుచేస్తారట
కరవుపై మొదట్నుంచీ మొద్దు నిద్రలోనే వైకాపా ప్రభుత్వం
ఈనాడు - అమరావతి 

జూన్‌ 1 నుంచి ఖరీఫ్‌ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. తీవ్ర కరవు ఉందని.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైతే పంటనష్టం గణన జాప్యమవుతుందని తెలిసినా ప్రభుత్వం రైతులంటే లెక్కలేనితనంతో వ్యవహరించింది. పోలింగ్‌ పూర్తయ్యేనాటికి పొలాలన్నీ ఖాళీగా ఉంటాయని తెలిసినా.. ఎంతమాత్రం పట్టించుకోలేదు. వాస్తవానికి గతేడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలో తీవ్ర కరవు ఉన్నా.. 466 మండలాల్లో దుర్భిక్షం నెలకొన్నా.. వైకాపా సర్కారు నాన్చివేత ధోరణితోనే వ్యవహరించింది. కరవెక్కడా లేదంటూ నీళ్లు నమిలి.. చివరకు 103 కరవు మండలాలతో సరిపెట్టింది. రబీలోనూ 661 మండలాల్లో డ్రైస్పెల్స్‌ ఉన్నా .. 87 కరవు మండలాలనే ప్రకటించింది. వాటిలోనూ నిజంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేసే ఆలోచనే కనిపించడం లేదు. కనీసం రెండో విడత కరవు మండలాల ప్రకటన కూడా చేయలేదు. 

రబీ కరవు ప్రకటన ఫిబ్రవరి నాటికే చేయాల్సి ఉన్నా.. సర్కారు కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 2018-19 రబీలో కరవు పరిస్థితులు ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం.. 2019 ఫిబ్రవరిలో కరవు మండలాలను ప్రకటించింది. అంటే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే నాటికే ప్రకటన పూర్తయింది. పంటనష్టం గణనకూ కావాల్సినంత సమయం దొరికింది. 

ఈ ఏడాది రబీలో కరవు ప్రకటన విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం అలవిమాలిన జాప్యం చేసింది. 2023 అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య 661 మండలాల్లో పొడివాతావరణం నెలకొంది. 255 మండలాల్లో ఒక డ్రైస్పెల్‌ (ఒక డ్రైస్పెల్‌ అంటే 21 రోజులు సరైన వానలు లేకపోవడం), 378 మండలాల్లో రెండు డ్రైస్పెల్స్, 28 మండలాల్లో మూడు డ్రైస్పెల్స్‌ ఉన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినరోజున.. అంటే మార్చి 16న హడావుడిగా 87 కరవు మండలాలను ప్రకటించింది. అప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో పంటనష్టం గణనను పక్కన పెట్టారు.

ఖాళీ పొలాల్లో.. దెబ్బతిన్న పంటలు కనిపిస్తాయా?

రబీలో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు. నంద్యాల, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 87 కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ 33% పైగా దెబ్బతిన్న పంటలను గుర్తించి నష్టం కింద రాయాలి. 24వ తేదీ లోగా పూర్తి చేసి జాబితాలను సామాజిక తనిఖీకి ఆర్‌బీకేల్లో ఉంచాలి. అంటే ఈ కొద్ది సమయంలో పంటనష్టం లెక్కల పూర్తి ఎలా సాధ్యమవుతుంది? పంటలే లేనప్పుడు గ్రామాల్లోని వ్యవసాయ సహాయకులకు పొలాల్లో ఏం కన్పిస్తుంది? ఏం నమోదు చేస్తారు? అనే ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. వైకాపా నేతలు, ఆ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన పేర్లు రాయడానికి తప్పితే.. నిజంగా నష్టపోయిన వారి పేర్లు నమోదు చేస్తారా? అనే సందేహాలూ వారిలో నెలకొన్నాయి. అదీగాక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయి. పంటనష్టం జాబితాల్లో ఏ మాత్రం తేడాలొచ్చినా.. వివాదాలు మరింత ముదిరే ప్రమాదమూ ఉంది.


661 మండలాలకు..  87 మండలాలే కనిపించాయట

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రబీలో తీవ్ర కరవు పరిస్థితులున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తగ్గించి చూపింది. 87 కరవు మండలాలనే ప్రకటించింది. రైతుల్ని అడిగితే ఎంతమేర దెబ్బతిన్నాయో చెబుతారు. అయినా ప్రభుత్వానికి అన్నదాతల బాగోగులు పట్టలేదు. రెండో విడత కరవు మండలాల ప్రకటనను కూడా పక్కన పడేసింది. ఖరీఫ్‌లోనూ ఇంతే నిర్లక్ష్యంగా 103 మండలాలతో సరిపెట్టింది. అప్పుడూ రెండో విడత కరవు మండలాల ప్రకటన లేదు. ఆగస్టులోనే కరవు మొదలైనా.. ముందస్తు ప్రకటనలోనూ రైతులకు తీరని అన్యాయం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు