రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత

బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది.

Updated : 20 May 2024 05:25 IST

5 నాటికి రాష్ట్రానికి నైరుతి!
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ఈనాడు డిజిటల్‌- విశాఖపట్నం, దిల్లీ: బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. ఇది ఏ దిశగా పయనిస్తుందన్నదానిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో అండమాన్‌ సమీపంలో ఏర్పడే తుపాన్లలో అధిక శాతం ఉత్తర దిశగా పయనించి బంగ్లాదేశ్‌ సమీపంలో తీరం దాటుతాయి. మరోవైపు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం లేకపోలేదని కొన్ని ప్రైవేటు సంస్థలు అంచనా వేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్‌ దీవులకు చేరుకున్నాయని, 31 నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. అనంతరం 5వ తేదీ నాటికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముంది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

మరో ఐదు రోజులు వర్షాలు..: ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాబోయే ఐదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని