రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై

ఓ పోలీసు అధికారి తన పోస్టల్‌ బ్యాలట్‌ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు.

Published : 20 May 2024 05:20 IST

ఈనాడు, అమరావతి: ఓ పోలీసు అధికారి తన పోస్టల్‌ బ్యాలట్‌ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. మార్చిలో ఎన్నికల బదిలీల్లో భాగంగా మంగళగిరి స్టేషన్‌కు వచ్చారు. ఆయనకు సొంతూరు కురిచేడులో ఓటు ఉంది. ఖాజాబాబుతో ఓటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5వేలు పుచ్చుకొని, ఆ మొత్తాన్ని ఎస్సైకి ఆన్‌లైన్‌లో పంపారు. సదరు నాయకుడు డబ్బులు పంపిణీ చేస్తూ ప్రకాశం జిల్లా పోలీసులకు చిక్కాడు. తనను విచారించిన పోలీసులతో ఎవరెవరికి డబ్బులు ఇచ్చిందీ తెలిపాడు. వాటిలో ఖాజాబాబు డబ్బులను వారి బంధువులకు ఇచ్చినట్లు చెప్పగా, పోలీసులు వారిని విచారించారు. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎస్సైపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీకి నివేదిక పంపారు. ఖాజాబాబును సస్పెండ్‌ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని