మాతృ మరణాల్లో సిజేరియన్‌ కేసులే అధికం

మాతృ మరణాల్లో సిజేరియన్‌ చేయించుకున్నవారు అధికసంఖ్యలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 362 మాతృ మరణాలు చోటుచేసుకున్నాయి.

Updated : 21 May 2024 04:41 IST

వైద్య ఆరోగ్యశాఖ పరిశీలనలో వెల్లడి

ఈనాడు, అమరావతి: మాతృ మరణాల్లో సిజేరియన్‌ చేయించుకున్నవారు అధికసంఖ్యలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 362 మాతృ మరణాలు చోటుచేసుకున్నాయి. ఇందులో సాధారణ ప్రసవం అనంతరం ప్రాణాలు విడిచినవారు 95 మంది ఉన్నారు. మిగిలిన 267 మరణాల్లో 189 మంది సిజేరియన్‌ చేయించుకున్నవారు. మిగతావారు గర్భం దాల్చి ప్రసవం కంటే ముందుగానే చనిపోయారు. సాధారణ కాన్పు కంటే... సిజేరియన్‌ కేసుల్లో మరణాలు ఎక్కువగా ఉండటంపై వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో 30-40%, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 60-70% వరకు సిజేరియన్లు జరుగుతున్నాయి. కొందరు ఈ కేసులను లాభాపేక్షతో చూస్తున్నారు.

125 ఆసుపత్రులకు నోటీసుల జారీ: ఆరోగ్యశ్రీ అనుబంధ గుర్తింపు కలిగిన కొన్ని ఆసుపత్రుల్లో వంద ప్రసవాలు జరిగితే... 90%, ఆపైన సిజేరియన్‌ కేసులు ఉంటున్నాయి. ఈ కేసుల్లో కొన్ని ఆసుపత్రులు ప్రత్యేక గుర్తింపు పొందాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ కేసులు భారీగా నమోదైన సుమారు 125 ఆసుపత్రుల నుంచి సంజాయిషీ కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నోటీసులు పంపింది. సిజేరియన్‌ కేసుల నమోదు ఎక్కువగా ఉండడానికి కారణాలు తెప్పించి పరిశీలించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్‌ విజయవాడలో సోమవారం జరిగిన సమీక్ష సందర్భంగా ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని