అనుమతుల పొడిగింపు రుసుములపై వివాదం

ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పొడిగింపు రుసుముల చెల్లింపుపై ఉన్నత విద్యామండలి, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల మధ్య వివాదం కొనసాగుతోంది.

Updated : 21 May 2024 04:45 IST

చెల్లించాల్సిందేనంటూ ఉన్నత విద్యామండలి ప్రకటన
చెల్లించబోమంటూప్రైవేటు డిగ్రీ కళాశాలల తీర్మానం

ఈనాడు, అమరావతి: ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పొడిగింపు రుసుముల చెల్లింపుపై ఉన్నత విద్యామండలి, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల మధ్య వివాదం కొనసాగుతోంది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రైవేటు డిగ్రీ కళాశాలలు అనుమతుల కోసం రూ.30వేల చొప్పున చెల్లించాలని ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ రుసుము చెల్లించే గడువు సోమవారంతో ముగిసింది. రూ.10వేల అపరాధ రుసుముతో ఈ నెల 23 వరకు అవకాశం కల్పించింది. ఈ రుసుములు చెల్లించబోమని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల సంఘం తీర్మానించింది. గతేడాది ఒకేసారి మూడేళ్లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం జీఓ జారీచేసిందని గుర్తుచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాలలు 550కిపైగా ఉన్నాయి. వీటిల్లో ఇప్పటివరకు 264 కళాశాలలు రుసుములు చెల్లించగా.. మిగతా యాజమాన్యాలు చెల్లించబోమని చెబుతున్నాయి. ఈ మేరకు సోమవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. రుసుములు చెల్లించాలని ఒత్తిడి చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతోపాటు అవసరమైతే కళాశాలలను మూసేస్తామని యాజమాన్యాల సంఘం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని