విధి వంచితులకు చేయూత

అప్పటివరకు సాఫీగా సాగుతున్న వారి జీవితంపై విధి పగబట్టింది. ఆడుకుంటూ విద్యుత్తు షాక్‌కు గురై చేయి కోల్పోయిన చిన్నారి ఒకరు.

Updated : 21 May 2024 06:36 IST

భుజం వరకు చేయి కోల్పోయినవారికి కృత్రిమంగా అమరిక
ఇలాంటివి అమర్చడం దేశంలోనే తొలిసారి
‘ది హ్యాండ్‌ ప్రాజెక్టు’ సంస్థ ఔదార్యం

ఈనాడు, అమరావతి: అప్పటివరకు సాఫీగా సాగుతున్న వారి జీవితంపై విధి పగబట్టింది. ఆడుకుంటూ విద్యుత్తు షాక్‌కు గురై చేయి కోల్పోయిన చిన్నారి ఒకరు.. కుటుంబపోషణ కోసం పనికి వెళుతూ రోడ్డుప్రమాదానికి గురై చేయి పోయినవారు మరొకరు.. విధుల్లో ఉండగా విద్యుత్తు షాక్‌కు గురై రెండు చేతులూ కోల్పోయి నిశ్చేతనంగా మారినవారు ఇంకొకరు.. పుట్టుకతోనే అంగవైకల్యం పొందినవారు మరొకరు. ఇలా దాదాపు 300 మందికి జర్మనీకి చెందిన ‘ది హ్యాండ్‌ ప్రాజెక్టు’ సంస్థ బాసటగా నిలుస్తోంది. మంగళగిరి రోటరీ కరవాలంబన ట్రస్టు ఆధ్వర్యంలో కృత్రిమ చేతులను పలువురికి ఉచితంగా అమర్చింది. మంగళగిరిలో ‘మంగళకరము-2024’ పేరుతో దీన్ని నిర్వహించారు. భుజం వరకు చేతులు లేనివారికి కృత్రిమ చేతులు అందించడం దేశంలో ఇదే తొలిసారి. జర్మనీ, న్యూజిలాండ్, ఆఫ్రికాల నుంచి వచ్చిన నిపుణులు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన వారికి కృత్రిమ చేతులు అమర్చారు. చేయిని అమర్చాక ఆపన్నులు, వారి కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. 

ఈ కృత్రిమ చేయి అన్నిచోట్లా లభించదు..

జమ్‌ ఎంకే-1 తరహా కృత్రిమ చేతిని జర్మనీలో తయారుచేస్తారు. ఇది మన దేశంలో లభించదు. ఒక్కో చేతి విలువ రూ.60 వేలపైనే. ‘ది హ్యాండ్‌ ప్రాజెక్టు’ ఫౌండర్‌ క్రిష్‌ గుల్లే ఆధ్వర్యంలోని నిపుణుల బృందం వీటిని బాధితులకు అమర్చింది. ఒక్కో చేతిని అమర్చేందుకు కనిష్ఠంగా 45 నిమిషాల నుంచి 4 గంటలు పడుతుంది. వీరికి సాయమందించడానికి 20 మంది ఫిజియోథెరపీ వైద్యుల బృందం వచ్చింది.రోటరీ క్లబ్‌ నుంచి 13 మంది సభ్యులు (రోటేరియన్స్‌), 15 మంది డిగ్రీ విద్యార్థులు సహకరించారు. లబ్ధిదారులు వారి స్వగ్రామాల నుంచి మంగళగిరికి వచ్చి కృత్రిమ చేతులు అమర్చుకున్నాక ఇంటికి చేరేవరకు అన్నీ పర్యవేక్షించారు. రవాణాఛార్జీల నుంచి భోజనం వరకు అందించారు. 

 హెల్ప్‌లైన్‌ నంబరు, వాట్సప్, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారాన్ని కల్పించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారి కృషివల్ల దాదాపు 240 మంది వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ సంస్థ గతేడాది కూడా మోచేయి వరకు చేతుల్లేని 458 మందికి ఉచితంగా కృత్రిమ చేతులను అమర్చింది. కృత్రిమ చేతిని అమర్చాక ఎలా వినియోగించాలనే అంశంపై అవగాహన కల్పించారు. కృత్రిమ చేతి వినియోగంలో సమస్యలు ఎదురైతే పరిష్కారానికి మంగళగిరిలోనే ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఇక్కడ శాశ్వతంగా అందుబాటులో ఉండనుంది. 


బైక్‌ నడపగలననే ఆత్మవిశ్వాసం వచ్చింది

- జగ్గారావు, విశాఖపట్నం

ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా పొరపాటున చెయ్యి మిషన్‌లో పడి కట్‌ అయ్యింది. తొమ్మిదేళ్లనుంచి ఇలా ఒంటి చేత్తోనే బతుకుతున్నా. కృత్రిమ చేతిని అమర్చాక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇది మామూలు చేతిలాగే ఉంది. బైక్‌ నడపగలననే ధైర్యం వచ్చింది. ఒకరిపై ఆధారపడకుండా జీవించవచ్చనే నమ్మకం కలిగింది. 


భార్య కష్టాన్ని చూసి గుండె తరుక్కుపోయేది

- నాగరాజు, గజ్వేల్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ

విద్యుత్తు శాఖలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేవాణ్ని. నాలుగేళ్ల కిందట విధుల్లో ఉండగా కరెంటుషాక్‌కు గురై రెండు చేతులు పోయాయి. ఇద్దరు చిన్న పిల్లలున్నారు. కూలిపని చేస్తూ ఇంటి కష్టాలన్నీ భార్య మోస్తోంది. ఆమె కష్టాలను చూసి గుండె తరుక్కుపోయేది. అమర్చిన కృత్రిమ చేతి వల్ల ఏదో ఒక పని చేసి కుటుంబానికి అండగా ఉంటాననే ధైర్యం మళ్లీ వచ్చింది.


కలా? నిజమా? తెలియడం లేదు

- కిరణ్‌ తండ్రి మోహన్‌రావు, విజయవాడ

2022లో సంక్రాంతినాడు మా అబ్బాయి (కిరణ్‌) గాలిపటాన్ని ఎగరేస్తున్నాడు. అది పక్కనే తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. గాలిపటం కోసం వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. అంతే అది పదడుగుల దూరంలోకి విసిరికొట్టింది. కోమాలోకి వెళ్లిన బిడ్డ చేయి కోల్పోయాడు. తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కృత్రిమ చేయి అమర్చాక బిడ్డను చూసుకుంటుంటే ఇది కలా? నిజమా? అనిపిస్తోంది.


కుడి చేత్తో రాయగలననే నమ్మకం కలిగింది

- బాల వెంకటసుబ్రహ్మణ్యం, ఏలూరు

నేను అధ్యాపకుడిని. 2004లో రోడ్డు ప్రమాదంలో కుడిచేయి పోయింది. ఎడమ చేతితో రాయడం నేర్చుకుని పిల్లలకు పాఠాలు చెబుతున్నా. మిత్రుల ద్వారా మంగళగిరిలో కృత్రిమ చేతులు అమర్చుతున్నారని తెలిసి ఇక్కడికి వచ్చా. చేయి అమర్చాక కుడి చేత్తో మళ్లీ రాయగలననే నమ్మకం కలిగింది.


అందరూ సంతోషంగా ఉండాలనేదే మా ఆలోచన

- క్రిష్‌ గుల్లే, ఫౌండర్, ది హ్యాండ్‌ ప్రాజెక్టు, జర్మనీ

చేతులు లేవనే ఆత్మన్యూనతకు ఎవరూ గురి కాకూడదు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలనే ఈ చిన్న పని చేస్తున్నా. వ్యక్తిగా, కుటుంబంగా, సమాజంగా అందరూ సంతోషంగా ఉండాలనేదే ఉద్దేశం. కృత్రిమ చేయి అమర్చాక బట్టలుతకడం, కూరగాయలు తరగడం, భోజనం చేయడం, ఇతర పనులనూ చేసుకోవచ్చు. శిక్షణ తీసుకున్నాక వెల్డింగ్‌ వంటి పనులూ చేయొచ్చు. 


సేవలోనే సంతోషం

- అన్నె రత్న ప్రభాకర్, పీడీజీ

ఇతరులకు సేవలోనే సంతోషం ఉంటుంది. ఈ భావనతోనే మంగళగిరి రోటరీ క్లబ్‌ ముందుకు వెళుతోంది. అందులోని సభ్యులందరూ దీనికే కంకణబద్ధులై ఉన్నారు. 300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతులు అమర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపడం ముదావహం. చేయి ఏర్పాటువల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 


ఆపన్నులకు కృత్రిమ చేతులు అందిస్తాం

 పీడీజీ వడ్లమాని రవి
మంగళగిరి రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ

సమావేశంలో మాట్లాడుతున్న రోటరీ ప్రతినిధి శరత్‌చౌదరి..
చిత్రంలో ‘ది హ్యాండ్‌ ప్రాజెక్టు’ ఫౌండర్‌ క్రిష్‌ గుల్లే, పీడీజీ వడ్లమాని రవి, రోటరీ ప్రతినిధులు

ఈనాడు, అమరావతి: అనుకోని దుర్ఘటనల్లో చేతులు కోల్పోయిన వారికి, పుట్టుకతోనే అంగవైకల్యం ఏర్పడిన వారికి కృత్రిమ చేతులు అమర్చడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తున్నామని పీడీజీ వడ్లమాని రవి పేర్కొన్నారు. దాదాపు 300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతులను ఉచితంగా అమర్చే క్రతువులో భాగస్వాములైనందుకు రోటరీ సభ్యులుగా గర్వపడుతున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 240 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, ఈ కార్యక్రమం 26వ తేదీ వరకు కొనసాగుతుందని, రోజుకు 35 మందికి కృత్రిమ చేతుల్ని అమర్చుతున్నామని వెల్లడించారు. మంగళగిరి రోటరీక్లబ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 7207403150కు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు కృత్రిమ చేయి అందిస్తామని తెలిపారు. మంగళగిరిలో సోమవారం నిర్వహించిన ‘మంగళకరము-2024’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఈ కార్యక్రమానికి ఎంపికైన లబ్ధిదారులే దేవుళ్లు. వారి ద్వారానే మాకు సేవచేసే అవకాశం దక్కింది. కృత్రిమ చేతులు అమర్చడంలో ‘ది హ్యాండ్‌ ప్రాజెక్టు’ ఫౌండర్‌ క్రిష్‌ గుల్లే సేవ అనన్య సామాన్యం. ఆయన న్యూజిలాండ్‌ నుంచి ఇక్కడికి వచ్చి దగ్గరుండి లబ్ధిదారులకు కృత్రిమ చేతులు అమర్చడం సేవానిరతిని చాటుతోంది’ అని కొనియాడారు. కార్యక్రమంలో వీటిజేఎమ్‌ డిగ్రీ కళాశాల కమిటీ పూర్వ అధ్యక్షుడు రామ్మోహన్‌రావు, ప్రాజెక్టు ఛైర్మన్‌ అనిల్‌ చక్రవర్తి, ఐపీడీజీ రాజశేఖరరెడ్డి, అన్నే రత్న ప్రభాకర్, శరత్‌చౌదరి, రాంప్రసాద్, వేణుగోపాల్‌ తదితరులు మాట్లాడారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని