పల్నాడులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం

ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల్లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, రైతును అరెస్టుచేసిన పోలీసులు.. వైద్యపరీక్షల కోసం వారికి బేడీలు తొడిగి ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకోవడం వివాదాస్పదంగా మారింది.

Updated : 21 May 2024 08:45 IST

బేడీలు తొలగిస్తున్న పోలీసులు

ఈనాడు, అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల్లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, రైతును అరెస్టుచేసిన పోలీసులు.. వైద్యపరీక్షల కోసం వారికి బేడీలు తొడిగి ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకోవడం వివాదాస్పదంగా మారింది. పల్నాడు జిల్లా మాచవరం ఎంపీపీ కుమారుడిపై ఈ నెల 14న దాడి జరిగింది. ఈ కేసులో మోర్జంపాడుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నిఖిల్‌తో పాటు రైతు మోహనరావును పోలీసులు అరెస్టుచేశారు. ఆ కేసుతో తమకు సంబంధం లేదని, అరెస్టుకు ముందు పోలీసులు తీవ్రంగా కొట్టారని వారు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వీరిద్దరూ రిమాండ్‌లో ఉన్నంత కాలం మూడు రోజులకోసారి జీజీహెచ్‌కు తరలించి వైద్యపరీక్షలు చేయాలని జడ్జి ఆదేశించారు. ఇందులో భాగంగా సోమవారం నిఖిల్, మోహనరావును ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పోలీసులు గుంటూరు జిల్లా జైలు వద్దకు వచ్చారు. వారిని వాహనంలోకి ఎక్కించే ముందు నిఖిల్‌కు బేడీలు వేయడంతో ఆయన కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు. ‘అసలు కేసే అక్రమంగా నమోదు చేశారనుకుంటే.. అది చాలదన్నట్లు చేతులకు బేడీలు వేయడం ఏంటి?’ అని వారు నిలదీశారు. విషయం తెలుసుకున్న తెదేపా రాష్ట్ర నాయకుడు కనపర్తి శ్రీనివాసరావు అక్కడికి చేరుకొని పోలీసుల తీరుపై మండిపడ్డారు. చివరికి వెనక్కి తగ్గిన పోలీసులు బేడీలు తొలగించి ఆసుపత్రికి తీసుకెళ్లారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని