సంక్షిప్త వార్తలు(11)

తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్‌ మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated : 22 May 2024 06:12 IST

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ఆలయం ఎదుట జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్, కుటుంబసభ్యులు 

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్‌ మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారిని న్యాయమూర్తి దర్శించుకున్నారు. 


మరో రూ.2 వేల కోట్ల అప్పులు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ అప్పు సమీకరించింది. రూ.1,000 కోట్లు 17 ఏళ్ల కాలపరిమితితో తిరిగి తీర్చేలా 7.40 శాతం వడ్డీకి, మరో రూ.1,000 కోట్లు 20 ఏళ్ల కాలపరిమితితో 7.38 శాతం వడ్డీకి తీసుకుంది. ఈ నిధులు బుధవారం ఖజానాకు చేరనున్నాయి.


జూన్‌ 2 నుంచి పెరగనున్న టోల్‌ రుసుములు

చౌటుప్పల్, న్యూస్‌టుడే: జూన్‌ 2 నుంచి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ రుసుములు పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్‌ 1న రుసుముల ధరలు పెరగనుండగా... ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. టోల్‌ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఎన్‌హెచ్‌ఏఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగియగానే రుసుములు సగటున 5 శాతం పెరగనున్నాయి.


24 నుంచి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి ప్రారంభమై జూన్‌ ఒకటితో పూర్తికానున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో ఏడాది వారికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 861 కేంద్రాల్లో మొదటి ఏడాది వారు 3,46,393, రెండో సంవత్సరం వారు 1,21,545 మంది పరీక్షలు రాయనున్నారు.


ఈఏపీసెట్‌కు 94.31 శాతం మంది హాజరు

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఏపీఈఏపీ సెట్‌-2024కు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్‌లో కలిపి మొత్తం 94.31 శాతం మంది హాజరైనట్లు సెట్‌ ఛైర్మన్, ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. ఉదయం 29,904 మందికి 28,087 మంది, మధ్యాహ్నం 30,518 మందికి 28,895 మంది (మొత్తం 94.31శాతం) హాజరయ్యారని ఒక ప్రకటనలో వెల్లడించారు. 


24న డీఈఈసెట్‌ 

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జిల్లా విద్య, శిక్షణ సంస్థల్లో రెండేళ్ల డీఈడీ కోర్సుల ప్రవేశానికి డీఈఈసెట్‌ను ఈ నెల 24న నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 4,949 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 


పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ 23 నుంచి

ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్‌ 3 వరకు చేపడతారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు 31 నుంచి జూన్‌ 5 వరకు అవకాశం కల్పించారు. 5 నే ఐచ్ఛికాలు మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అదే నెల 7న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. 10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతుంది. విద్యార్థులు సీటు పొందిన కళాశాలల్లో వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్‌ విధానం ద్వారా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. జూన్‌ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది పాలిసెట్‌లో మొత్తం 1,24,430 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. 


వ్యవసాయ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు(జిల్లా పరిషత్‌), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సార్వత్రిక, దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో జులైలో నిర్వహించనున్న వ్యవసాయ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ కె.గురవారెడ్డి తెలిపారు. మిద్దె తోటలు, పట్టు పురుగుల పెంపకం, జీవ ఎరువుల తయారీ కోర్సుల ప్రవేశాలకు జూన్‌ 20 లోపు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ www.angrau.ac.in ని సందర్శించాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


కౌన్సిల్, కమిషన్‌ పదాలను తొలగించండి 

వినియోగదారుల స్వచ్ఛంద సంస్థలకు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ ఆదేశం 

ఈనాడు, అమరావతి: వినియోగదారుల స్వచ్ఛంద సంస్థలు తమ పేరులో కౌన్సిల్, కమిషన్‌ అనే పదాలను ఉపయోగించడం చట్టవిరుద్ధమని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ దృష్టికి పలు ఫిర్యాదులు వచ్చాయని.. ఏవైనా స్వచ్ఛంద సంస్థలకు అలాంటి పేర్లు ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించారు. ‘వినియోగదారుల రక్షణ చట్టంలో రూపొందించిన నిబంధనల ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లా వివాదాల పరిష్కార కమిషన్‌.. వినియోగదారుల రక్షణకు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వ సంస్థల్ని సూచిస్తుంది. 1956 కంపెనీల చట్టం ప్రకారం, మరే ఇతర చట్టం పరిధిలో రిజిస్టర్‌ చేయబడిన వినియోగదారుల సంఘాలను ప్రభుత్వ సంస్థగా పరిగణించరు. చట్టబద్ధమైన నియమాలు, నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించే వరకు అలాంటి సంఘాలు కౌన్సిల్, కమిషన్‌ అనే పదాలను ఉయోగించేందుకు అర్హత లేదు’ అని స్పష్టం చేశారు.  


కిర్గిజ్‌స్థాన్‌ నుంచి విద్యార్థులను రప్పించాలని కిషన్‌రెడ్డి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: కిర్గిజ్‌స్థాన్‌లో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి లేఖ రాశారు. అక్కడ ఘర్షణల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు చొరవ చూపాలని కోరారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదివేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ మంది అక్కడ ఉన్నారని.. వారంతా స్వస్థలాలకు తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. వీలైనంత తొందరగా వారిని రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు.


గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలి

కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం

ఈనాడు, అమరావతి: ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్‌ అనుసంధానంతో గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పెద్దఎత్తున చేపట్టాలని అధికారులను సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత్తు సరఫరా తదితర అంశాలపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో భూగర్భ జలాల పెంపునకు తోడ్పడే పనులకు అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎస్‌ సూచించారు. తాగునీరు, విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇంధనశాఖ అధికారులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని