గుంతల రోడ్లకు రెండు ప్రాణాలు బలి

రాష్ట్రంలో గుంతల రోడ్లు ప్రాణాలు తీస్తున్నాయి. గుంతల్ని చూసి అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఒకరు, బురదతో నిండిపోయిన గోతుల్లోపడి మరొకరు మంగళవారం మృతి చెందారు. రోడ్డు మీద గుంతలు పూడ్చలేని పాలకుల నిర్లక్ష్యం రెండు కుటుంబాలను దుఃఖంలో ముంచేసింది.

Updated : 22 May 2024 05:56 IST

చింతలపూడి వద్ద చనిపోయిన జ్యోతి

చింతలపూడి (దుగ్గిరాల), న్యూస్‌టుడే: రాష్ట్రంలో గుంతల రోడ్లు ప్రాణాలు తీస్తున్నాయి. గుంతల్ని చూసి అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఒకరు, బురదతో నిండిపోయిన గోతుల్లోపడి మరొకరు మంగళవారం మృతి చెందారు. రోడ్డు మీద గుంతలు పూడ్చలేని పాలకుల నిర్లక్ష్యం రెండు కుటుంబాలను దుఃఖంలో ముంచేసింది.

చింతలపూడి వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెంది.. ముగ్గురు కుమార్తెలకు కన్నీరు మిగిల్చింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఆలేటి రామ్‌చంద్, జ్యోతి(34) దంపతులకు ఇంటర్, పది, ఎనిమిదో తరగతి చదివే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. రామ్‌చంద్‌ బాపట్ల జిల్లా అమృతలూరు మండలం మూల్పూరు పశు వైద్యశాలలో వెటర్నరీ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. దీంతో అక్కడికి దగ్గర్లోని తెనాలిలోని సుల్తానాబాద్‌లో కుటుంబంతో సహా ఉంటున్నారు. వీరి కుమార్తెలు మంగళగిరిలో నృత్యం నేర్చుకుంటున్నారు. మంగళవారం రాత్రి కుమార్తెల నృత్య ప్రదర్శన ఉండటంతో చూసేందుకని రామ్‌చంద్, జ్యోతి ఇద్దరూ ద్విచక్ర వాహనంపై మంగళగిరి బయలుదేరారు. మార్గమధ్యలో చింతలపూడి వద్దకు రాగానే రోడ్డుపై పెద్దఎత్తున గుంతలు చూసి రామ్‌చంద్‌ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేశారు. జ్యోతి కంగారుపడి ముందుకు దూకేశారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖం రోడ్డుకు బలంగా తాకి, స్పృహ కోల్పోయారు. వెంటనే తెనాలి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మృతి చెందారు.

ప్రమాదానికి కారణమైన చింతలపూడి వద్ద గుంతలు

బురద రోడ్డుపై మరొకరు.. 

గుడివాడ గ్రామీణం: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని టీచర్స్‌ కాలనీకి చెందిన వడ్లమూడి మహాలక్ష్మీ కోటేశ్వరరావు (61) సోమవారం రాత్రి సరకులు కొనడానికి మోటారు సైకిల్‌పై మార్కెట్‌కు వెళ్లారు. చీకట్లో తిరిగివెళ్తుండగా గుంతలు పడి బురదమయంగా ఉన్న రహదారిపై వాహనం జారి పడి అపస్మారకస్థితికి చేరారు. అదే ప్రాంతంలో అటుగా వెళ్తున్న యువకులు బురదలో కూరుకుపోయిన కోటేశ్వరరావును పైకి లేపి సపర్యలు చేశారు. ఆయన ఊపిరి తీసుకుంటున్నాడని గుర్తించి వెంటనే 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. రోడ్డుపై గుంతలో నిలిచిన వర్షపు నీరు బురద వల్లే కోటేశ్వరరావు మృతి చెందారని స్థానికులు చెబుతున్నారు. భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు గుడివాడ వన్‌టౌన పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు