కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు మృతి

ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు అలియాస్‌ కృష్ణబాబు(71) మంగళవారం మృతిచెందారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు.

Updated : 22 May 2024 06:21 IST

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు అలియాస్‌ కృష్ణబాబు(71) మంగళవారం మృతిచెందారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆంధ్రాషుగర్స్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్యాల శ్రీరామచంద్ర వెంకటకృష్ణ రంగారావు, అచ్చాయమ్మ దంపతులకు మూడో సంతానంగా కృష్ణబాబు జన్మించారు. సంస్థ పూర్వ అధ్యక్షుడు ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌కు స్వయానా మేనల్లుడు. ఎన్‌.టి.రామారావు తెదేపాను స్థాపించాక రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణబాబు 1983లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 2004 ఎన్నికల్లో తెదేపా నుంచే గెలిచారు. 1999లో ఓటమి పాలయ్యారు. 2012లో వైకాపాలో చేరిన ఆయన 2014, 2019 ఎన్నికల్లో ప్రచారానికే పరిమితం అయ్యారు. ఆ తర్వాత పార్టీలో ఉన్నా విశ్రాంత జీవనం గడుపుతున్నారు. కృష్ణబాబు భార్య అన్నపూర్ణ కొంతకాలం క్రితం మృతిచెందారు. కుమారులు వెంకటరాయుడు, రవిబాబు పారిశ్రామికవేత్తలు. కుమార్తె అర్చన గృహిణి. అల్లుడు ఎస్‌.రాజీవ్‌కృష్ణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, కొవ్వూరు నియోజకవర్గ వైకాపా పరిశీలకునిగా కొనసాగుతున్నారు. కృష్ణబాబు మృతదేహాన్ని మంగళవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి కొవ్వూరు నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం దొమ్మేరు తీసుకొచ్చారు. బుధవారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని