అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు డీఓ విధానం తొలగింపు

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో డిపార్టుమెంట్‌ అధికారి(డీఓ) నియామక విధానాన్ని రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసమంటూ.. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ విధానానికి స్వస్తి పలికారు.

Updated : 22 May 2024 05:55 IST

ప్రైవేట్‌ కళాశాలల్లోని లెక్చరర్లనే  నియమించుకోవాలని ఆదేశం

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో డిపార్టుమెంట్‌ అధికారి(డీఓ) నియామక విధానాన్ని రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసమంటూ.. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ విధానానికి స్వస్తి పలికారు. డిపార్టుమెంట్‌ అధికారి లేకపోతే పరీక్ష కేంద్రాల పరిశీలన గాడితప్పే ప్రమాదం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం పరీక్ష కేంద్రాలకు.. ప్రభుత్వ కళాశాలలకు చెందిన వారిని చీఫ్‌ సూపరింటెండెంట్‌(సీఎస్‌)తో పాటు డిపార్టుమెంట్‌ అధికారి(డీఓ)ని నియమిస్తున్నారు. ఇప్పుడు మొదటిసారిగా సీఎస్‌ ఒక్కరినే నియమించి, డీఓగా ఆయా కళాశాలల్లోని ఎవరో ఒకర్ని వినియోగించుకోవాలంటూ ఇంటర్‌ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ప్రైవేట్‌ కళాశాలల్లో ఆయా కళాశాలలకు చెందిన జూనియర్‌ లెక్చరర్లే డీఓగా ఉంటారు.

ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు తీసుకురావడం, వాటిని లెక్కించి గదులకు పంపించడం, అన్ని పరీక్ష కేంద్రాలను పరిశీలన చేయడం లాంటి విధులు నిర్వర్తిస్తారు. ఇలాంటి కీలకమైన పోస్టును ప్రైవేట్‌ కళాశాలల్లోని వారికి అప్పగిస్తే పరీక్షలు ఎంత వరకు పకడ్బందీగా కొనసాగుతాయి? కొన్నిచోట్ల ఆ కళాశాలలో చదివిన వారికి అక్కడే(సెల్ఫ్‌ సెంటర్లు) కేంద్రాలు కేటాయిస్తారు. ఇలాంటి చోట ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు సీఎస్‌లుగా ఉంటారు. డీఓ లేకపోతే ఇక్కడ పరీక్షల పరిస్థితి ఏంటి.. అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. జూనియర్‌ కళాశాలలను జూన్‌ 1 నుంచి పునఃప్రారంభించనున్నారు. అప్పటి నుంచే ప్రవేశాలు మొదలవుతాయి. ఆ సమయానికల్లా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలూ పూర్తవుతాయి. కానీ, ప్రవేశాల పేరుతో డీఓ విధానాన్ని ఇప్పుడే కమిషనర్‌ రద్దు చేశారనే ప్రచారం సాగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని